ప్రస్తుతం ఏపీ లో నెలకొన్న పరిస్థితులు సీఎం జగన్ కు ఆందోళన కలిగిస్తున్నాయి .జనాలకు ఎంత చేస్తున్న , ప్రభుత్వం పై వ్యతిరేకత పెరుగుతుండడం, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పై చేయి సాధిస్తుండడం వంటివి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
దీనికితోడు పార్టీలో అంతర్గతంగా పెరిగిపోతున్న గ్రూపు రాజకీయాలు మరింత కంగారును పుట్టిస్తున్నాయి. వీటన్నిటిని త్వరలోనే పరిష్కరించడం తో పాటు, ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుంది అనే విషయం పైన జగన్ కొంతమంది మంత్రుల వద్ద చర్చించినట్లు సమాచారం.
ముందస్తు ఎన్నికలకు వెళితే ఎంతవరకు ప్రతిఫలం ఉంటుంది ? దీనివల్ల తలెత్తే ఇబ్బందులు ఏమిటి ? ఇలా అనేక అంశాలపై చర్చించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా కొంతమంది మంత్రులు , ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల వ్యవహార శైలిపై జగన్ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.అప్పుడే మూడేళ్లు గడిచిపోయాయని.అయినా మెజార్టీ ఎమ్మెల్యే లు జనాల్లో తిరగకుండా , సొంత వ్యాపార వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారని , ఇలా అయితే రాబోయే ఎన్నికల్లో గెలవడం కష్టమని ఆగ్రహం వ్యక్తం చేశారట.
ఇక నిరంతరం ఎమ్మెల్యే లు, మంత్రులు, పార్టీ కీలక నాయకులు జనాల్లో ఉంటూ, స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సూచించారట .ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని, గత ప్రభుత్వం తో పోలిస్తే తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఎంత పెద్దపీట వేసింది అనే విషయం సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలని జగన్ సూచించారట.
ప్రభుత్వం ఎంత చేస్తున్న, జనాల్లోకి వెళ్లకుండా టీడీపీ అనుకూల మీడియా అడ్డుకుంటోందని, ఆ మీడియా ప్రచారాన్ని తిప్పికొట్టేలా వ్యవహరించాలని చెప్పారట.పార్టీ ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని , తాను కూడా త్వరలోనే జనాల్లోకి వస్తానని , జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేపడతానని చెప్పినట్టు సమాచారం.
పార్టీకి నవరత్నాలు పథకం చాలా మూలాధారం అని, వాటికి ఎటువంటి చెడ్డపేరు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేల పై ఉందని జగన్ చెప్పినట్లు సమాచారం.మంత్రుల సమావేశంలో జగన్ జనం బాట పట్టబోతున్నట్టు సంకేతాలు ఇవ్వడం పార్టీలో జోష్ నింపుతోంది.