తెలంగాణ లో తప్పకుండా అధికారంలోకి వస్తాము అనే ధీమా బీజేపీ కేంద్ర పెద్దల్లో కనిపిస్తోంది.అందుకే తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడమే కాకుండా, 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన అన్ని ఎత్తుగడలను ఇప్పటి నుంచే అమలు చేస్తున్నారు.
గతంతో పోలిస్తే తెలంగాణాలో బీజేపీ యాక్టివ్ అయ్యింది.దుబ్బాక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడం ఆ పార్టీలో మరింత ధీమా వచ్చేలా చేసింది.
ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.ఈ మేరకు స్పెషల్ టీం కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం.
గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించిన సమయంలో, తెలంగాణలో పరిస్థితులను అంచనా వేసేందుకు ఆ టీమ్ రంగంలోకి దిగింది.మళ్లీ ఇప్పుడు అమిత్ షా కు చెందిన టీం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం గురించి ఒక నివేదిక తయారు చేసి కేంద్ర నాయకత్వానికి సమర్పించేందుకు జనవరి మొదటి వారంలోనే రంగంలోకి దిగిపోతున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
దేశవ్యాప్తంగా బీజేపీ కి ఎదురుగాలి వీస్తుండడంతో, కాస్తోకూస్తో ఆశ ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటి నుంచే పట్టు పెంచుకోవడం ద్వారా, తమకు తిరుగులేకుండా చేసుకునేందుకు, రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఢోకా లేకుండా చేసుకునేందుకు బీజేపీ అధిష్టానం పెద్దలు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కనిపిస్తున్నారు.అందుకే పెద్ద ఎత్తున టిఆర్ఎస్ లో చేరికలను ప్రోత్సహించడంతో పాటు , బలమైన నాయకులను ఇతర పార్టీల నుంచి చేర్చుకుని మరింత బలోపేతం కావాలని చూస్తున్నారు.
ముఖ్యంగా రిజర్వుడు సీట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారట.తెలంగాణలో ఉన్న 19 ఎస్ సి , 12 ఎస్టీ అసెంబ్లీ స్థానాల్లో గెలిచేందుకు ఏవిధమైన వ్యూహాలు అమలు చేయాలని దానిపైన ఇప్పుడు అమిత్ షా కు చెందిన టీం వాస్తవ పరిస్థితిని అంచనా వేసి ,నివేదిక ఇవ్వబోతోందట.

దీని ప్రకారం తెలంగాణలో బీజేపీ పట్టు పెంచుకునేందుకు ఏం చేయాలనే విషయంపై అమిత్ షా రాష్ట్ర నేతలకు కీలక సూచనలు చేస్తారట.ప్రస్తుతం తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు , ప్రభుత్వ వైఫల్యాలను బిజెపి జనాల్లోకి తీసుకువెళ్లి , టిఆర్ఎస్ ఇరుకున పెట్టాలనే విధంగా బిజెపి అధిష్టానం పెద్దలు తెలంగాణ నేతలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.