ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంటుంది.పార్టీ స్థాపించి 50 ఏళ్లు అవుతున్నా, పూర్తిస్థాయిలో బలోపేతం అవ్వకపోవడం, ఆ పార్టీలో పవన్ తప్ప ఆ స్థాయి నాయకులు పెద్దగా కనిపించకపోవడం, ఏదో ఒక పార్టీకి మద్దతు ఇస్తూ రాజకీయాలు చేస్తుండడం, ఇలా చెప్పుకుంటూ వెళితే , ఎన్నో అంశాలు జనసేన ను ఇబ్బంది పెట్టేవే.
పెద్ద ఎత్తున పార్టీలో చేరిన నాయకులు అంతే స్పీడుగా పార్టీ నుంచి బయటికి వెళ్ళి పోతూ ఉండటం, జనాల్లో పేరు ప్రఖ్యాతలు ఉన్న నాయకులు సైతం కొంత కాలానికి పై విమర్శలు చేస్తూ బయటకు వెళ్ళి పోతూ ఉండటం వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారాలు జనసేన అభిమానులకు , పవన్ కు పెద్దగా ఇబ్బంది లేదు అన్నట్లు గా కనిపిస్తున్న , జనాలోకి వచ్చేసరికి పవన్, జనసేన తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
అంతే కాదు ఇతర పార్టీల నుంచి జనసేనలోకి వెళ్దామని చూస్తున్న నాయకుల దూకుడుకి బ్రేకులు వేసే విధంగా ఈ వ్యవహారాలు ఉంటున్నాయి.
చిత్తశుద్ధితో పవన్ రాజకీయాల్లో సక్సెస్ అవుతానని వచ్చినా, ఇక్కడ పరిస్థితులు అందుకు విరుద్దంగా ఉండడం, నాయకుల మనస్తత్వాలు , పవన్ మనస్తత్వానికి సెట్ కాకపోవడం, పార్టీ విధానాలను అమలు చేసే క్రమంలో వేస్తున్న తప్పటడుగులు ఇలా ఎన్నో అంశాలు జనసేనకు చేటు తెస్తున్నాయి.
జనసేన పార్టీ స్థాపించిన దగ్గర ఇప్పటి వరకు చూసుకుంటే, ఆ పార్టీలో ఉన్న వారిలో పవన్ తర్వాత ఆ స్థాయిలో రాజకీయాలు చేసే నాయకులు పెద్దగా కనిపించడం లేదు .ఒక్క నాదెండ్ల మనోహర్ తప్పించి, మిగతా నాయకుల హడావుడి ఏమీ కనిపించదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్న , ఏ ప్రకటన చేయాలన్న, పవన్ మాత్రమే తీసుకోవాల్సి ఉండడం, ఏ పార్టీతో ఎంతకాలం పొత్తు పెట్టుకుంటారో, ఏ విషయంపై ఎంతకాలం ఓకే స్టాండ్ తో ఉంటారో తెలియని పరిస్థితి.ఇలా అనేక అంశాలు జనసేన ను దెబ్బతీస్తున్నాయి.

జనాల్లో క్లీన్ ఇమేజ్ ఉన్న జెడి లక్ష్మీనారాయణ వంటి వారు జనసేన కు దూరం కావడం వంటివి పవన్ రాజకీయాన్ని మరింత అనుమానానికి గురి చేసింది.ఇప్పుడు పార్టీలో ఉన్న నేతలు ఒక్కొక్కరు బయటికి వెళ్లి పోతున్న పరిస్థితి కనిపిస్తోంది.ఇటీవలే పార్టీ సీనియర్ నాయకుడు, మొదటి నుంచి పవన్ తో ఉన్న మాధాసు గంగాధర్బయటకు వెళ్లిపోయారు.ఆయన బయటకు వెళ్లడానికి కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు.కానీ అంతిమంగా జనసేన ఇమేజ్ ను బాగా దెబ్బ తీసే విషయమే ఇది.ప్రస్తుతం పార్టీలో ఉన్న కొంతమంది నాయకుల్లో అయినా, పవన్ భరోసా కల్పించే విధంగా చేయగలిగితే రానున్న రోజుల్లో జనసేనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది.లేకపోతే ఎప్పుడూ ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అనడంలో సందేహం లేదు.