ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌తో ప్రజలు అల్లాడిపోతున్నారు.ఇప్పటికే లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, వేల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి.
రోజురోజూకు ఈ మహమ్మారి మరింత విజృంభిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.ముఖ్యంగా భారత్‌లో కరోనా వైరస్ తన పంజా విసురుతూ మరింత వ్యాపిస్తోండటంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే దాదాపు 15 వేల మార్క్‌కు చేరుకుంది.రోజుకు 900 పైబడి కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో తెలంగాణ సర్కార్ ఆలోచనలో పడింది.
ఈ కరోనా వ్యాప్తిని ఎలా నియంత్రించాలి అనే అంశంపై సీఎం కేసీఆర్ రోజూ అధికారులు, వైద్య నిపుణులతో చర్చలు సాగిస్తున్నారు.అయితే ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి లాక్‌డౌన్ విధించడమే ఉత్తమమని పలువురు సూచించడంతో కేసీఆర్ సర్కార్, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధింపుపై కేసీఆర్ ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నారు.అయితే లాక్‌డౌన్ విధించే అవకాశాలే ఎక్కువగా ఉండటంతో, ప్రజలు మరోసారి లాక్‌డౌన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పలువురు అంటున్నారు.
కాగా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేవలం లాక్‌డౌన్ ఒక్కటే మార్గమా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తుంది.ఒక్క లాక్‌డౌన్‌తోనే కరోనా వ్యాప్తిని నివారించవచ్చు అనేది అవాస్తవమని పలువురు నిపుణుల తేల్చేశారు.
ఇప్పుడు విధించే లాక్‌డౌన్ తరువాత మళ్లీ జనం రోడ్లపైకి వస్తారు.అప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరగడం ఖాయమని అంటున్నారు.
అయితే ఇలా లాక్‌డౌన్ కాకుండా కరోనా టెస్టుల సంఖ్యను పెంచడం, మాస్క్ వేసుకోకుండా తిరిగేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం లాంటివి చేస్తేనే కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చని ప్రజలు కూడా సూచిస్తున్నారు.మరి కేసీఆర్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తాడో చూడాలి.
ఏదేమైనా హైదరాబాద్‌లో మరోసారి లాక్‌డౌన్ అనే వార్త ప్రస్తుతం జోరుగా వినిపిస్తోంది.