నల్లగొండ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు నిర్మించి ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.శనివారం జిల్లాకు పంపిన ఇందిరమ్మ మోడల్ ఇంటిని కలెక్టర్ ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఒక్కోటి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తుందని,ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతన 3500 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని సంకల్పించడమే కాకుండా, మంజూరు చేసిందన్నారు.
వివిధ రకాల డిజైన్లతో కూడిన ఇందిరమ్మ ఇండ్ల నమూనాలను ఇదివరకే ప్రజల్లోకి,ప్రత్యేకించి లబ్ధిదారుల అవగాహన కోసం విడుదల చేయడం జరిగిందన్నారు.కలెక్టరేట్ ఆవరణలో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటిని రాష్ట్ర మంత్రులు ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందేనని,అంతేకాక అన్ని మున్సిపల్,మండల కేంద్రాలలో సైతం నమూనా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఇదివరకే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని,దీంతోపాటు,నమూనా ఇందిరమ్మ ఇండ్ల మోడళ్లను పంపించి జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో ప్రజల అవగాహన కోసం ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
ఇందిరమ్మ ఇండ్లపై లబ్ధిదారులకు, గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు,పట్టణ ప్రాంత ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత గృహ నిర్మాణ శాఖ అధికారులపై ఉందన్నారు.