తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పుడు గ్రూపు రాజకీయాలు తెరపైకి వస్తూనే ఉంటాయి.ముఖ్యంగా సీనియర్ నాయకులు మధ్య ఎప్పుడు ఆధిపత్యపోరు నడుస్తూ ఉంటుంది.
అధిష్టానం వద్ద ఎవరికి వారికి విడివిడిగా పలుకుబడి ఉండడంతో, తామే గొప్ప అన్నట్లుగా ఫీలవుతూ ఉంటారు.ఈ వ్యవహారమే ఆ పార్టీని అధికారంలోకి రాకుండా చేస్తోంది అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రేవంత్ రెడ్డికి ఆ పార్టీ అధిష్టానం కట్టబెట్టిన దగ్గర నుంచి సీనియర్ నాయకుల్లో మరింత అసంతృప్తి పెరిగింది.చాలామంది సీనియర్లు ఇప్పటికీ ఆయన నాయకత్వాన్ని ఒప్పుకోకుండా అధిష్టానం వద్ద ఏదో ఒక ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు.
అయినా, రేవంత్ ఎప్పటికప్పుడు సర్దుకుపోతూ నే వస్తున్నారు.కేవలం ములుగు ఎమ్మెల్యే సీతక్క , మధుయాష్కీ తదితరులు కొంతమంది రేవంత్ అనుకూల వర్గం గా ముద్ర వేయించుకున్నారు .అయితే మిగతా కాంగ్రెస్ సీనియర్లు ఎవరూ పెద్దగా యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.అయితే కాంగ్రెస్ సీనియర్లలో మల్లు భట్టి విక్రమార్క కాస్త యాక్టివ్ గానే వ్యవహరిస్తున్నారు.
సీఎల్పీ నేతగా కూడా ఆయన ఉండడంతో తన ప్రభావం చూపిస్తున్నారు.అయితే ఇప్పుడు అధికార పార్టీ టిఆర్ఎస్ కన్ను బట్టి విక్రమార్క పై పడినట్లుగా ప్రచారం జరుగుతోంది.
రేవంత్ రెడ్డి దూకుడుకు కళ్లెం వేసేందుకు బట్టి విక్రమార్క ను టిఆర్ఎస్ లో చేర్చుకోవాలని, ఆ విధంగా కాంగ్రెస్ ను తెలంగాణలో పూర్తిగా దెబ్బతీసేందుకు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ వ్యూహం రచించారట.

ఇప్పటికే భట్టి విక్రమార్క కు కెసిఆర్ ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు .అలాగే కేటీఆర్ సైతం ఆయనను అనేక సందర్భాల్లో పొగిడారు.ముఖ్యంగా దళిత బంధు పథకం ను బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో కూడా అమలు చేశారు.
అలాగే ఈ పథకాన్ని అమలు చేసే ముందు నిర్వహించిన సమావేశానికి బట్టి విక్రమార్క హాజరై కేసీఆర్ ను ప్రశంసించారు .అప్పట్లోనే ఆయన టీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం జరిగినా, సైలెంట్ అయిపోయారు.అయితే ఇప్పుడు రేవంత్ దూకుడు మరింతగా పెంచడంతో, ఏదోరకంగా బట్టి విక్రమార్క ను టిఆర్ఎస్ లో చేర్చుకోవాలని, దీని ద్వారా తెలంగాణ కాంగ్రెస్ దూకుడుకు బ్రేక్ వేయడంతో పాటు, పెద్ద ఎత్తున ఆ పార్టీ సీనియర్లను తమ పార్టీలోకి వచ్చే విధంగా చేసుకోవాలి అనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలుస్తోంది.