ఈటెల రాజేందర్ మరో మూడు రోజుల్లో బిజెపిలో అధికారికంగా చేరబోతున్నారు అంతకు ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 19 ఏళ్ల టిఆర్ఎస్ అనుబంధాన్ని పూర్తిగా తెంచుకో బోతున్నారు.రాజేందర్ ను అకస్మాత్తుగా టిఆర్ఎస్ మంత్రివర్గం నుంచి తప్పించడంతో పాటు, ఆయన ఆస్తుల పైన విచారణకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశించడంతో రాజేందర్ సైతం టీఆర్ఎస్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు చూస్తున్నారు.
అందుకే హుజురాబాద్ ఉప ఎన్నికలకు వెళ్లి తన బలం ఎంత ఉంది అనేది టిఆర్ఎస్ పెద్దలకు చూపించాలని ఆయన నిర్ణయించుకున్నారు.అంతకుముందే ఆయన సొంత పార్టీ పెడతారనే హడావుడి పెద్ద ఎత్తున జరిగినా, రాజేందర్ మాత్రం బిజెపి వైపు మొగ్గు చూపారు.
తన పై జరుగుతున్న విచారణ నుంచి బయటపడాలంటే బిజెపి ఒక్కటే సేఫ్ అని ఆయన భావించడమే.
చాలామంది ఈటెల సన్నిహితులతో పాటు , మేధావులు బిజెపిలోకి వెళ్లడాన్ని అంగీకరించకపోయినా, ప్రస్తుత పరిస్థితుల్లో టిఆర్ఎస్ వేధింపుల నుంచి తట్టుకోవాలంటే బిజెపి వంటి పార్టీ అండదండలు ఉండాలని రాజేందర్ బలంగా నమ్మడమే దీనికి కారణం.
అయితే రాజేందర్ ఊహించినట్లుగా బీజేపీలో ఆయనకు పెద్ద పీట వేస్తారా అంటే అది అనుమానంగానే ఉంది.

ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీలో ఎంతోమంది నాయకులు ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఉన్నారు గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి.తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు రెండు వర్గాలుగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్న సమయంలో రాజేందర్ చేరినా ఈ గ్రూపు రాజకీయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారనే చర్చ జరుగుతోంది.

ఆర్ ఎస్ యూ నేపథ్యం నుంచి వచ్చిన రాజేందర్ ఆర్ ఎస్ ఎస్ నేపథ్యం ఉన్న బీజేపీలో చేరడం చాలా కష్టమైన క్లిష్టమైన పరిస్థితే.గతంలో ఎంతో మంది నాయకులు బిజెపిలో చేరి ఆ పార్టీలో ఇమడలేక తమ ప్రాధాన్యం తగ్గడం అవమానంగా భావించి బయటకు వెళ్లిపోయారు.కానీ రాజేందర్ ముందుగా ఊహించినట్లుగా , ప్రతిపాదన పెట్టినట్లుగా బీజేపీలో ఆయనకు ఆ స్థాయిలో ప్రాధాన్యత దక్కడం అనుమానమే.