అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా జనంలోకి వచ్చారు.శనివారం జరిగిన నార్త్ కరోలినా రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.వచ్చే ఏడాది జరగనున్న మధ్యంతర ఎన్నికలను అమెరికా మనుగడ కోసం పోరాటంగా ఆయన అభివర్ణించారు.
జో బైడెన్‌పై విమర్శలు గుప్పించిన ట్రంప్.అమెరికాను ఆయన నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
అమెరికా మనుగడ కోసం రిపబ్లికన్లను ఎన్నుకుంటూ రావాలని.వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికలతో ఇది ప్రారంభం కావాలని ట్రంప్ పిలుపునిచ్చారు.
2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్రంప్ అనడంతో జనం కేకలు, చప్పట్లతో ఆడిటోరియాన్ని హోరెత్తించారు.బైడెన్ సరిహద్దు విధానం, చైనా, రాడికల్ లెఫ్ట్ డెమొక్రాట్స్, క్రిటికల్ రేస్ థియరీ సహా పలు అంశాలపై ట్రంప్ ఆవేశపూరిత ప్రసంగం చేశారు.
ఇదే సమయంలో కోవిడ్‌ను ఎదుర్కోవాలని, వ్యాక్సిన్లను మరింత అభివృద్ధి పరచాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రజల నుంచి ఆశించిన స్పందన రాలేదు.మరోవైపు నిబంధనలు ఉల్లంఘించి క్యాపిటల్ భవనంపై తన మద్ధతుదారులతో దాడి చేయించారంటూ ఫేస్‌బుక్ ట్రంప్ ఖాతాపై రెండేళ్ల నిషేధం విధించడంపై ఆయన మండిపడ్డారు.వచ్చే రెండేళ్లలో వారు తనను తిరిగి అనుమతిస్తారన్న ఆసక్తి లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్లు, మీడియా అవినీతికి పాల్పడ్డారనడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదని ఆయన అన్నారు.

వైట్ హౌస్‌ను వీడిన తర్వాత, సోషల్ మీడియా నుంచి బహిష్కరణ తర్వాత ఆయన రిపబ్లికన్ అభ్యర్ధులకు మద్ధతు ఇవ్వడానికి, శత్రువులపై విరుచుకుపడటానికి ఈమెయిల్స్‌ను మాధ్యమంగా చేసుకున్నారు.ఇదే సమయంలో వేదికపైకి వచ్చిన ఆమె కోడలు లారా ట్రంప్ తాను సెనేట్ సీటుకు పోటీ చేయడం లేదని ప్రకటించారు.మరోవైపు ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ నిరాధారమైన ఆరోపణలు చేయడంతో పాటు ఆయన మద్ధతుదారులు జనవరి 6న కాపిటల్ భవనంపై దాడి చేయడంతో కొద్దిమంది రిపబ్లికన్లు ట్రంప్‌తో విబేధించారు.డెమొక్రాట్ల గుప్పిట్లో నుంచి కాంగ్రెస్‌ను తిరిగి చేజిక్కించుకోవాలని రిపబ్లికన్లు భావిస్తున్నారు.
కాగా, నార్త్ కరోలినా వేదికపై సుమారు 90 నిమిషాల పాటు మాట్లాడిన ట్రంప్‌ను రిపబ్లికన్లు సెనేట్ ఎన్నికల్లో వినియోగించుకోవాలని భావిస్తున్నారు.దీనిని బట్టి ఆయన త్వరలో భారీ ర్యాలీల్లో పాల్గొంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు.