ఎన్నో ఆశలతో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వైయస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టి ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ, విభాగాల వారీగా, అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడుతూ, వారి అభిప్రాయం తెలుసుకుంటూ కొత్త పార్టీ విధి విధానాలను ఖరారు చేసుకునే పనిలో ఉన్నారు. ఏప్రిల్ 9 న కొత్త పార్టీ పేరును షర్మిల ప్రకటించేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు.
దాని కంటే ముందుగానే అన్ని జిల్లాల నాయకులతోను వైఎస్ అభిమానులతోనూ కలిసి ముందడుగు వేసే వారితోనూ షర్మిల భేటీ అవుతూ వస్తున్నారు.అయితే షర్మిల కొత్త పార్టీ ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలు తెలంగాణలో బలం పెంచుకున్నాయి.ఇక కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో గట్టి పట్టు ఉంది.
దీంతో షర్మిల పార్టీలోకి ఏ ఏ ప్రధాన పార్టీల నుంచి ఎవరెవరు వచ్చి చేరుతారు ? వైస్ వీర విధేయులు ఎంతమంది షర్మిలతో అడుగులు వేస్తారు ? ఇలా ఎన్నెన్నో సందేహాలు కలుగుతున్నాయి.
ఆర్థికంగా సామాజికంగా బలమైన, సీనియర్ నేతలు ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో పాతుకుపోయారు.
వైస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన నాయకులు, ఇప్పుడు ఇతర పార్టీలలో బలమైన నాయకులుగా వివిధ పదవులు అనుభవిస్తున్నారు ఇప్పటికిప్పుడు షర్మిల కొత్త పార్టీ పెట్టినా, ఆమెను నమ్మి వచ్చి చేరే అవకాశం అయితే కనిపించడం లేదు.ఎందుకంటే షర్మిల పార్టీ పెట్టినా అధికారం దక్కించుకునే అంత స్థాయిలో అయితే ఈ ఎన్నికలలోపు బలపడే అవకాశం లేదనే విషయం అందరికీ తెలుసు.
అందుకే సీనియర్ నాయకులు షర్మిల పార్టీ వైపు చూడటం లేదు.ప్రస్తుతం ఆమెను కలుస్తున్న వారంతా చిన్న చితకా లీడర్లే.ఎక్కువ మంది కొత్తవారే కనిపిస్తున్నారు.

షర్మిల పార్టీ పేరు ప్రకటించి, తెలంగాణ అంతటా ఆమె పాదయాత్ర నిర్వహిస్తే అప్పుడు వచ్చిన రెస్పాన్స్ ను బట్టి షర్మిల పార్టీలోకి వలసలు ఉంటాయి తప్ప సీనియర్ పొలిటిషియన్స్ ఎవరూ షర్మిల వైపు వచ్చే అవకాశమే లేదన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.అయితే షర్మిల మాత్రం వైఎస్ వీరాభిమానులు, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లోని కీలక నాయకులు చాలామందే వస్తారని ఆశలు పెట్టుకున్నారు.