ఎట్టకేలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి మేయర్ అభ్యర్ధిగా గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు.అసలు టీఆర్ఎస్ కు మేయర్ పీఠం దక్కుతుందా అనే అనుమానాలు అందరిలోనూ ఉంటూ వచ్చాయి.
దీనికి కారణం బోటాబోటిగా గ్రేటర్ లో టీఆర్ఎస్ కు ఫలితాలు రావడమే కారణం.ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో గ్రేటర్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందో అనే టెన్షన్ అన్ని పార్టీల నేతలలోనూ ఉంటూ వచ్చింది.
ఏదైతేనేం ఈ రోజు ఉత్కంఠగా సాగిన గ్రేటర్ మేయర్ ఎన్నికలలో టిఆర్ఎస్ అనుకున్న మేరకు సక్సెస్ అయింది.ఈ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ సైతం గట్టి పోటీనే ఏర్పడింది.
చివరకు ఎంఐఎం పార్టీ సహకారంతో టీఆర్ఎస్ కు ఆ పీఠం దక్కింది.అప్పటి వరకు దీనిపై ఉత్కంఠ కొనసాగింది.
గ్రేటర్ మేయర్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఎంఐఎం స్నేహం పై చాలా విమర్శలు బీజేపీ చేసింది.
ఎంఐఎంతో స్నేహంపై టిఆర్ఎస్ పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ, ఆ ఎన్నికలలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు బిజెపి గట్టిగానే ప్రయత్నాలు చేసింది.
దీంతో అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీనీ దూరం పెడుతోనే వచ్చింది.అలాగే టిఆర్ఎస్ నాయకులు ఎం ఐ ఎం పై విమర్శలు చేస్తూ, ఆ పార్టీ తమకు సంబంధం లేదు అన్నట్లు గా వ్యవహరించారు.
కానీ చివరకు వచ్చేసరికి ఎంఐఎం మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి టిఆర్ఎస్ కు ఏర్పడింది.ఇప్పుడు ఇదే అంశంపై బిజెపి, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలను ఇరుకున పెట్టేందుకు అవకాశం ఏర్పడింది.
రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఇదే అంశంతో టిఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాల్లో బిజెపి నిమగ్నమైంది.ఇక టిఆర్ఎస్ విషయానికి వస్తే, మేయర్ ఎంపిక టిఆర్ఎస్ లో పెద్ద వివాదాన్ని రేపింది.

ఈ పదవిని ఆశించిన దివంగత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు.తనకే దక్కుతుందని ప్రచారం చేసుకున్నారు.కానీ ఎవరూ ఊహించని విధంగా విజయలక్ష్మికి ఆ అవకాశం దక్కింది.ఆమె కాకుండా మరికొంత మంది ఆశావహులు మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్నా , చివరకు నిరాశే ఎదురయ్యింది.
ఇది ఇలా ఉంటే విజయారెడ్డి మాత్రం మేయర్ పదవి దక్కకపోవడంతో అలకబూని, ఓటింగ్ లో సైతం పాల్గొనకుండా వెళ్లిపోవడం , ముందు ముందు మరికొంతమంది తమ అసంతృప్తిని వెళ్లగక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ లో ఎక్కడలేని కంగారు కనిపిస్తోంది.