భార్య చనిపోయిందంటూ తప్పుడు సమాచారం ఇచ్చి తనను మానసికంగా కృంగిపోయేలా చేసినందుకు గాను ఓ ఎన్ఆర్ఐ వైద్యుడు ఎయిరిండియాను కోర్టుకు లాగాలని నిర్ణయించుకున్నాడు.వివరాల్లోకి వెళితే.
అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు, ప్రఖ్యాత అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ వినాయకోమ్‌కు బుధవారం సాయంత్రం ఎయిరిండియా అధికారి నుంచి ఫోన్ వచ్చింది.న్యూఢిల్లీ నుంచి వాషింగ్టన్‌కు ఎయిరిండియా విమానంలో వస్తున్న మీ భార్య ఫ్లైట్‌లోనే మరణించారంటూ సమాచారం అందించాడు.
తనను తాను న్యూఢిల్లీలోని ఎయిరిండియా కార్యాలయ మేనేజర్‌గా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి వినాయకోమ్‌కు ఈ విషయం చెప్పాడు.తమ విమానంలో ప్రయాణిస్తున్న మీ భార్య డాక్టర్ సుబ్బలక్ష్మీ మరణించారని అతను వినాయకోమ్‌కు తెలియజేశాడు.
అలాగే వాషింగ్టన్ డీసీ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిరిండియా మేనేజర్‌గా పనిచేస్తున్న తేజ్‌బీర్ సింగ్ కొలియా ఫోన్ నెంబర్‌ను అతనికి ఇచ్చాడు.విమానాశ్రయంలో భౌతికకాయం తీసుకునేందుకు తేజ్‌బిర్ సాయం చేస్తాడని వెల్లడించాడు.
ఈ వార్త వినగానే డాక్టర్ వినాయకోమ్ షాక్‌కు గురయ్యారు.విహారయాత్ర కోసం ఈ డాక్టర్ దంపతులు భారత్‌లోని తమ స్వగ్రామం కేరళ రాజధాని తిరువనంతపురం వచ్చారు.
అయితే లాక్‌డౌన్ కారణంగా వీరు ఇక్కడే చిక్కుకుపోయారు.అయితే డాక్టర్ సుబ్బలక్ష్మీ మాత్రం ఒంటరిగా గత బుధవారం అమెరికాకు బయల్దేరారు.
ఎయిరిండియా మేనేజర్ ఆమె మరణవార్త చెప్పిన వెంటనే ఒకటికి పదిసార్లు చెక్ చేయమని కోరారు వినాయకోమ్.కానీ అతను మళ్లీ మళ్లీ అదే సమాధానం చెప్పాడు.
దీంతో వినాయకోమ్.వాషింగ్టన్‌లోని తన నివాసంలో కేర్ టేకర్‌కు ఫోన్ చేశాడు.డాక్టర్ సుబ్బలక్ష్మీ కొద్ది నిమిషాల క్రితమే తనతో మాట్లాడారని, తనను ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిందిగా చెప్పారని కేర్‌టేకర్ డాక్టర్ వినాయకోమ్‌కు చెప్పింది.కాస్త ఊపిరి పీల్చుకున్న ఆయనకు ఎయిరిండియాపై పట్టరాని కోపం వచ్చింది.
బతికున్న మనిషిని చనిపోయిందని చెప్పడం వినాయకోమ్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది.
కాగా ప్రఖ్యాత జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్‌గా పనిచేశాడు.తన వృత్తి జీవితంలో ఎంతోమంది వీవీఐపీలకు చికిత్స చేశాడు.1992లో కారు ప్రమాదానికి గురైన కేరళ మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్ మెరుగైన చికిత్స కోసం అమెరికాకు వెళ్లినప్పుడు డాక్టర్ వినాయకోమ్ ట్రీట్‌మెంట్ చేశారు.తప్పుడు సమాచారం కారణంగా తను అనుభవించిన మానసిక క్షోభకు గాను ఎయిరిండియాపై కేసు పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు.
డాక్టర్ సుబ్బలక్ష్మీ బుక్ చేసుకున్న బిజినెస్ క్లాస్ సీటులో కూర్చొన్న మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు.
దీంతో ఎయిరిండియా సిబ్బంది ఆమెనే సుబ్బలక్ష్మీగా భావించి వెంటనే టికెట్ పీఎన్ఆర్ కోడ్‌లో ఉన్న కాంటాక్ట్ నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు.దీనిని డాక్టర్ వినాయకోమ్ ఖండించారు.
చనిపోయిన మహిళ.తన భార్యో కాదో చెక్ చేసుకోవాలని తాను ఒకటికి పదిసార్లు కోరానని గుర్తుచేశారు.
కానీ విమాన సిబ్బంది పీఎన్ఆర్ నెంబర్ కాకుండా మిగిలిన వివరాలు ఎందుకు పరిశీలించలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు.ఈ ఘటనను ఎయిరిండియా తీవ్రంగా పరిగణించింది.
ప్రస్తుతం అమెరికాలో వున్న క్రూ సిబ్బంది భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.