మే 3 తర్వాత లాక్ డౌన్ నిబంధనలు సడలించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.మార్చి 21 తేదీ నుంచి ఇప్పటి వరకు జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది.
ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది.ఆర్థికంగా ప్రజలకు దేశానికి తీవ్ర నష్టం చేకూరింది.
అయినా కరోనా వైరస్ అదుపులోకి రాలేదు.మరింతగా విజృంభిస్తోంది.
ఇప్పట్లో ఇది అదుపులోకి అవకాశాలు కూడా కనిపించడం లేదు.అలా అని సుదీర్ఘకాలం పొడిగించుకుంటూ వెళ్తే ఆకలి చావులు చూడాల్సి వస్తుంది.
ఉపాధి లేక వలస కూలీలు, చిన్నా చితకా ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికే ఎన్నో ఆకలి చావులు చూడాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసేందుకు కేంద్రం మొగ్గుచూపుతోంది.అయితే ఎటువంటి ఆంక్షలు విధించకుండా, జనాలను రోడ్లపై స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతి ఇస్తే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతుందని, జనాలు గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చి కరోనా వ్యాప్తికి మరింత కారణం అవుతారని కేంద్రం భావిస్తోంది.
పాఠశాలలు, ప్రజారవాణా, సినిమా హాళ్లు, మాల్స్, కళ్యాణ మండపాలు ఇలా అన్నింటి పైనా మరికొంతకాలం యధావిధిగా నిబంధనలు కొనసాగించాలని చూస్తోంది. ప్రజలు ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గమని కేంద్రం భావిస్తోంది.
అందుకే లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసినా, పూర్తిస్థాయిలో జనాలను రోడ్లపై తిరగకుండా కట్టడి చేయాలని కేంద్రం భావిస్తోంది. పూర్తిగా కరోనా ప్రభావం తగ్గిన తర్వాత మాత్రమే పూర్తిస్థాయి లో నిబంధనలు ఎత్తివేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
అందుకే లాక్ డౌన్ అనేది నిరంతర ప్రక్రియ అని, పదే పదే నాయకులు చెబుతున్నారు.

ఇక ఈ సమయంలో ఉపాధి దెబ్బతినకుండా రోజువారి సాధారణ జీవితం గడిపే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రం ఆలోచిస్తుంది.
కొద్ది రోజుల క్రితమే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కు, గ్రీన్ జోన్లలో వ్యాపార వ్యవహారాలను నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే ఇతర దుకాణాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది.
మే 3 తర్వాత ప్రజలకు స్వేచ్ఛ లభించినా, అది పరిమిత నిబంధనల మేరకే ఉంటుంది. ప్రజలు ఆంక్షలతో కూడిన జీవితం మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే సంకేతాలు పంపించింది.
ఇక ప్రజలు అటువంటి జీవితాన్ని గడిపేందుకు మానసికంగా ఇప్పటి నుంచే సిద్ధం కావాల్సిందే.గాత్రహంలో మాదిరిగా స్వేచ్ఛగా రోడ్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ, విందులు, వినోదాల పేరుతో హడావుడి చేసేందుకు ఇప్పట్లో అవకాశం లేనట్టుగానే పరిస్థితి కనిపిస్తోంది.