ఆంధ్రప్రదేశ్ ఎన్నో రుచికరమైన వంటలకు ప్రసిధ్ది చెందింది.వాటిల్లో ఒకటే పూతరేకు.
అందులోనూ ఆత్రేయపురం పూతరేకు పేరు వినగానే నోరూరుతుంది.పల్చటి పొరలు,పొరలుగా ఉండే పూతరేకు రుచి తింటున్న కొద్ది మరింత రుచి పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది.
అటువంటి పూతరేకుకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు ఎపి ప్రభుత్వం సంకల్పించింది.అందులో భాగంగా భారీ పూతరేకును తయారుచేసింది.

గోదావరి జిల్లాల్లో పుట్టి ప్రాశస్త్యం చెందిన పూతరేకును అంతర్జాతీయ బ్రాండ్ గా మలిచే క్రమంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కోసం రాష్ట్ర పర్యాటక ప్రాధికార సంస్థ, భవానీ ఐల్యాండ్ టూరిజం కార్పొరేషన్ లు సంయుక్తంగా కృషి చేసి అత్యంత భారీ పూత రేకును తయారుచేయించారు.పూత రేకుల తయారీలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆత్రేయపురం నుంచి పాక శాస్త్ర నిపుణులు శ్రీలక్ష్మి, శేషారత్నం, మహేశ్వరి, బాల సుబ్రహ్మణ్యం, నరేష్ అనే వారిని ఇక్కడకు రప్పించి తయారీ పనులు అప్పగించారు.
పూతరేకు తయారిలో భాగంగా తొలుత కుండపై పూతలు తీసి ఆ తరువాత వాటిని మధుర పదార్థాలతో నింపి సాయంత్రం వీటన్నింటినీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో ఒకదానికొకటి కలుపుతూ చుట్టలు చుడుతూ 10.8 మీటర్ల పొడవైన పూతరేకును తయారీని పూర్తి చేశారు.దీన్ని పరిశీలించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు ప్రతినిథి సంతూ చుహాన్ తమ బుక్ లో దీనికి స్థానం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.త్వరలో అధికారికంగా ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ జారీ చేస్తామన్నారు.