రాజీనామా బాటలో అధికార పార్టీ సర్పంచ్?

సూర్యాపేట జిల్లా:హుజూర్‌నగర్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది.

మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామ సర్పంచ్ దాసరి విజయలక్ష్మి వెంకటరమణ తన పదవికి రాజీనామా చేయనున్నారనే అంశం మండలంలో చర్చనీయాంశంగా మారింది.

విజయలక్ష్మి మట్టపల్లి సర్పంచ్ గా గెలిచిన నాటి నుండి సరైన నిధులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు సన్నిహితులతో చెప్పుకొని బాధపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.అందువల్లనే ఇక ఆర్థిక బాధలు భరించలేక సర్పంచ్ గిరికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా వినికిడి.

ఇదే విషయమై జిల్లా పంచాయతీ అధికారి యాదయ్యకు వివరించినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.ఒకటి రెండు రోజుల్లో డీపీఓను కలిసి రాజీనామా లేఖను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మఠంపల్లి మండలం హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సొంత మండలం కావడం గమనార్హం.మట్టపల్లి సర్పంచ్ రాజీనామాకు సిద్ధపడడం వెనుక అసలు కారణం ఆర్థిక పరిస్థితి కాదని,అధికార పార్టీలో అంతర్గత రాజకీయ వర్గ విభేదాలే కారణామై ఉండొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

మఠంపల్లి మండలంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా రెండు గ్రూపులు రాజకీయం చేస్తున్నాయని అందరికీ తెలిసిందే.ఇందులో సర్పంచ్ ఏ గ్రూపుకు అనుకూలంగా నడుచుకున్నా మరొక గ్రూపువారు టార్గెట్ చేస్తుంటారని,ఈ వర్గ పోరులో ప్రస్తుతం రాజకీయం చేయలేమని,గ్రామ సర్పంచ్ గా ఉంటూ ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాననే బాధలో సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం.

ఇద్దరు కొట్టుకుంటే మూడోని లాభం అనేది పాత సామెత కానీ,ఇక్కడ రెండు గ్రూపులు కొట్టుకుంటే మూడోడు బలి కావడం గమనార్హం.తన సొంత మండల పార్టీలోని వర్గపోరును స్థానిక ఎమ్మెల్యే రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటే ఇక్కడి దాకా వచ్చేది కాదని పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్న మాట.ఇప్పటికైనా ఎమ్మెల్యే జోక్యం చేసుకొని నివారణ చర్యలు చేపడతారా? లేక సర్పంచ్ ను సాదరంగా సాగనంపుతారా? చూడాలి మరి!.

Advertisement

తాజా వార్తలు