జగన్ పరిపాలన అంతా బ్రహ్మాండంగానే ఉన్నా, ఆయన తీసుకుంటున్న కొన్ని కొన్ని నిర్ణయాలు పదేపదే వివాదాస్పదం అవుతున్నాయి.ప్రతిపక్షాలు విమర్శలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.
జగన్ ఎంత పారదర్శకంగా తన పరిపాలనను ప్రజలకు అందించాలని ప్రయత్నాలు చేస్తున్నా, అది సాధ్యం కావడం లేదు.దీనికి సొంత పార్టీ నాయకుల పనితీరు కూడా ఒక కారణం.
జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత తీరిగ్గా నష్ట నివారణ చర్యలు తీసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తూ ఉండటం, అప్పటికే ప్రభుత్వంపై మచ్చలు ఏర్పడటం వంటివి జరుగుతూ వస్తున్నాయి.జగన్ ఏడాదిన్నర పరిపాలనలో వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చారు, కానీ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని విషయాల్లో ఆయన అభాసుపాలు కావాల్సి వచ్చింది.
ముఖ్యంగా హిందుత్వం విషయంలో బీజేపీ, టీడీపీ చేసిన విమర్శలు జగన్ ఇమేజ్ ను బాగా డేమేజ్ చేశాయి.ఆ వివాదం నుంచి ఏదో కాస్త బయటపడినట్లుగా కనిపించినా, ఇప్పుడు సొంత పార్టీ నాయకులు జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం మరోసారి చర్చనీయాంశం అవుతోంది.
ముఖ్యంగా ఇతర పార్టీల నాయకులను వైసీపీలో చేసుకునే విషయంలో జగన్ ఎన్నో రకాలు విమర్శలు ఎదుర్కొంటున్నారు.సొంత పార్టీ నాయకులకు అసంతృప్తి మిగుల్చుతున్నారు.ఈ తరహా విధానం పార్టీకి, పార్టీలోని నాయకులకు చేటు చేస్తుందని తెలిసినా, జగన్ మాత్రం పట్టించుకోనట్టు వ్యవహరిస్తుండడం, సొంత పార్టీ నాయకులకు ఆగ్రహం కలిగిస్తోంది.

గతంలో వైసీపీలోకి ఇతర పార్టీల నాయకులు చేరేందుకు ప్రయత్నించినా, జగన్ ఎక్కడికక్కడ బ్రేకులు వేశారు.ఎవరైనా ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి రావాలంటే ఆయా నియోజకవర్గాల్లోని నాయకుల అనుమతి తీసుకోవాలని , వారు అంగీకరిస్తేనే సదరు నాయకులను చేర్చుకోవాలని కండిషన్ పెట్టుకున్నారు.దీంతో చాలా వరకు చేరికలకు బ్రేకులు పడ్డాయి.
దీంతో జగన్ ఆ నిర్ణయాన్ని మార్చుకుని, కొన్ని నిబంధనలు సడలించడంతో పెద్ద ఎత్తున నాయకులు వైసీపీలో చేరిపోయారు.ఆ విధంగానే తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు నలుగురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చి వైసీపీలో చేరకుండానే మద్దతుదారులుగా నిలబడ్డారు.
వీరితో పాటు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇలా చేరికలతో వైసీపీలో సందడి మొదలయ్యింది.అయితే నాయకులను చేర్చుకునే విషయంలో నియోజక వర్గాల ఇంచార్జీలకు, కీలక నాయకులకు కనీసం సమాచారం ఇవ్వకుండా, జగన్ వైసీపీ కండువా కప్పుతున్నారని, కనీసం తమకు ఏ చిన్న సమాచారం కూడా ఇవ్వడంలేదు అంటూ మండిపడుతున్నారు.
ఈ వ్యవహారాలు నియోజకవర్గంలో గ్రూపు తగాదాలకు కారణమవుతున్నాయి.మొదటి నుంచి వైసీపీలో ఉన్నవారికి, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మధ్య అసలు పొసగడం లేదు.ఒకరిపై ఒకరు ఆధిపత్యపోరు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తూ, వైసీపీ పరువు బజారున పడేస్తున్నారు.

ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే తరహా తంతు జరుగుతుండటంతో, జగన్ తీరుపై సొంత పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.అసలు గ్రూపు తగాదాలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఇదేనని నాయకులు ఆరోపిస్తున్నారు.ఈ విషయం జగన్ కు తెలిసినా, ఇదే సూత్రాన్ని ఆయన అమలు చేస్తూ వస్తుండడం పార్టీ శ్రేణులకు సైతం మింగుడు పడడం లేదు.
ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి చేరుతున్న వారి కారణంగా, పార్టీకి లాభం ఉందో లేదో తెలియదు కానీ, ప్రస్తుతం ఇలా చేరిన వారి కారణంగా వైసీపీలో అసంతృప్తులు పెరిగిపోయి, మొదటికే మోసం వచ్చే లా కనిపిస్తుంది.ఈ విషయంలో తప్పు చేస్తున్నానని తెలిసినా, జగన్ మాత్రం పదే పదే కొనసాగిస్తూ పార్టీలో అలజడులకు పరోక్షంగా కారణం అవుతున్నారు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.