వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం గురించి చెప్పుకోవాలంటే అందరూ సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటూ, ఒకరికోసం మరొకరు అన్నట్టుగా తమ ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు.ఎవరు ఏ సహాయం కావాలన్నా చేస్తూ, అందరివాళ్లుగా గుర్తింపు పొందారు.
అయితే ఇప్పుడు మాత్రం వైఎస్ కుటుంబంలో ఆ పరిస్థితి లేదని, ఎవరికి వారే అన్నట్టుగా వీరి మధ్య వ్యవహారం ఉందని, ముఖ్యంగా జగన్ ఆయన సోదరి షర్మిలకు మధ్య విభేదాలు ఉన్నాయని, అలాగే జగన్ తల్లి విజయమ్మ సైతం కొన్ని విషయాల్లో జగన్ తో విబేధిస్తున్నారని, అందుకే ఆమె పూర్తిగా షర్మిల పార్టీ కోసం పని చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు చాలా రోజుల నుంచి వస్తున్నాయి.దీనికి తగ్గట్లుగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా విజయమ్మ వైయస్ సన్నిహితుల అందరితోనూ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు.వీరందరికీ ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.అయితే ఈ కార్యక్రమానికి జగన్ కు ఆహ్వానం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.అలాగే వైఎస్ వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు అంతా కలిసికట్టుగా ఆయనకు నివాళులు అర్పించాల్సి ఉన్నా, ఇప్పుడు ఎవరి షెడ్యూల్ వారిదే అన్నట్లు గా విడివిడిగా రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనబోతుండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
సెప్టెంబర్ 2వ తేదీన ఇడుపులపాయలో జగన్ కుటుంబ సభ్యులందరితో కాకుండా, ప్రత్యేకంగా వెళుతుండటం, అలాగే విజయమ్మ సైతం విడిగానే ఈ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం హైదరాబాదులో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అంతే కాకుండా ఈ సమావేశంలోనే విజయమ్మ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు గా ఉన్న ఆమె ఆ పదవికి రాజీనామా చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.వైసిపి కి రాజీనామా చేసిన తర్వాత ఆమె వైఎస్సార్ టిపి కి గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికే షర్మిల పార్టీ కోసం విజయమ్మ చాలా కష్టపడుతున్నారు.
పార్టీ ఆవిర్భావం నుంచి షర్మిల పక్కనే ఉంటూ ఆ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఆమె వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది.
అదే జరిగితే వైసీపీకి, జగన్ కు ఈ వ్యవహారం తీవ్ర ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికీ వైసీపీకి గౌరవాధ్యక్షురాలుగా విజయమ్మ ఉంటూనే షర్మిల పార్టీ కోసం పని చేస్తుండడం పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
వైసీపీ రెబల్ ఎంపీ రాఘురామ కృష్ణంరాజు వంటి వారు ఈ వ్యవహారాన్ని తప్పుపట్టారు.ఈ క్రమంలోనే విజయమ్మ వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని, దానికి సెప్టెంబర్ రెండో తేదీన ముహూర్తం గా నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.