కరోనా వల్ల అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశం అమెరికాయే.వైరస్ వెలుగులోకి వచ్చిన తొలి నాళ్లలో నాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉదాసీన వైఖరి కారణంగా అమెరికన్లు భారీ మూల్యం చెల్లించుకున్నారు.
ఆ తర్వాత ట్రంప్ మేల్కొన్నప్పటికీ అప్పటికే పరిస్ధితి విషమించింది.రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలతో అగ్రరాజ్యంలో మృత్యుదేవత కరాళ నృత్యం చేసింది.
అసలు అమెరికా ఇప్పట్లో కరోనా విపత్తు నుంచి బయటపడుతుందా అన్నంతగా అనుమానాలు వ్యక్తమయ్యాయి.కానీ ట్రంప్ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్.
తన తొలి లక్ష్యంగా కోవిడ్ కట్టడిని ఎంచుకుని తీవ్రంగా కృషి చేశారు.వ్యాక్సినేషన్ ఒక్కటే వైరస్‌కు విరుగుడుగా భావించిన ఆయన టీకా యజ్ఞం చేశారు.
వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంతో ఆ మధ్య వైరస్ ఉద్ధృతి దాదాపుగా తగ్గుముఖం పట్టింది.ఇదే ఆనందంలో జూలై 4న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరపడంతో పాటు అదే రోజున కరోనా విముక్తి దినోత్సం కూడా నిర్వహించారు.
కానీ ఆ సంతోషం అమెరికన్లకు ఎక్కువరోజులు లేదు.వైరస్ తగ్గినట్లే కన్పించినా.
గత కొన్ని రోజులుగా మళ్లీ విజృంభిస్తోంది.
ముఖ్యంగా ఫ్లోరిడా రాష్ట్రంలో డెల్టా ప్రభావం తీవ్రంగా వుంది.
ఇక్కడి ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతుండగా.అంబులెన్స్‌లు రోడ్లపై బారులు తీరుతున్నాయి.
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రోగులు అంబులెన్సుల్లోనే గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.డెల్టా వేరియంట్ వ్యాప్తి నానాటీకి పెరిపోతున్న నేపథ్యంలో మరోసారి గతేడాది తరహా పరిస్థితులు చోటు చేసుకోకుడా యూఎస్ ఎఫ్‌డీఏ కీలక నిర్ణయం తీసుకుంది.
అవయవ మార్పిడి చేసుకున్న రోగులకు, తక్కువ వ్యాధి నిరోధక శక్తి వున్న వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలని సిఫారసు చేసింది.దేశ జనాభాలో 3 శాతం మందికి ఈ అదనపు డోసు ఇవ్వాల్సి వుంటుందని ఎఫ్‌డీఏ తెలిపింది.
అటు అమెరికన్లు రెండు డోసుల తర్వాత మరో టీకా తీసుకునేందుకు అనుమతిస్తూ అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) ఆదేశాలు జారీ చేసింది.

అమెరికాలో ఇప్పటికే సగం జనాభాకు 2 డోసుల వ్యాక్సిన్ వేశారు.అయినప్పటికీ మూడో వేవ్ లో చాలామంది కరోనా బారిన పడుతున్నారు.ప్రస్తుతం ఆ దేశంలో లక్షకు పైగా కొత్త కరోనా వేరియంట్ కేసులు బయటపడుతున్నాయి.
కరోనా మరోమారు అగ్రరాజ్యంపై పంజా విసురుతున్న క్రమంలో మూడో డోసు టీకాకు అనుమతివ్వడం వల్ల అమెరికన్లకు మరింత రక్షణ దొరుకుతుందని అక్కడి వైద్య నిపుణులు భావిస్తున్నారు
.