తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు మార్చారు.గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు సరికొత్త రాజకీయాలను చేసేందుకు సిద్ధమయ్యారు.
ఎన్నికలకు ఇంకా సమయం చాలా తక్కువ ఉండడంతో అందరినీ కలుపుకుని వెళ్లే విధంగా కేసీఆర్ వ్యవహారం ఉంది.గతంలో తాను ప్రాధాన్యం ఇవ్వకుండా పక్కన పెట్టిన వారిని ఇప్పుడు దగ్గర చేసుకుని, వారి ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు.
ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి పెద్దగా పట్టు లేదు.పట్టు సాధించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.
ఇప్పటికే టీఆర్ఎస్ కొన్నిచోట్ల బలంగానూ, మరికొన్నిచోట్ల బలహీనంగా ఉందనే విషయాన్ని టీఆర్ఎస్ గుర్తించింది .ఈ క్రమంలోనే పార్టీలో ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం ఏ ప్రాధాన్యం లేకుండా సైలెంట్ గా ఉన్న బలమైన నాయకులను గుర్తించింది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మంచి పట్టు ఉంది.2014 లో టీడీపీ తరఫున పోటీ చేసిన ఆయన ఓటమి తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. వెంటనే ఆయనకు ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం ఇచ్చారు.ఆ తర్వాత పాలేరు నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చెందారు.
ఓటమి చవిచూసినా, ఆయన వల్ల కలిగే భవిష్యత్తు లాభాలను కేసీఆర్ గుర్తించారు.
ఆయనకు క్రమక్రమంగా ప్రాధాన్యత ఇస్తూ ఉండడం గానే, రెండోసారి ఎమ్మెల్సీ పదవిని కేసీఆర్ రెన్యువల్ చేస్తారని నాగేశ్వరరావు భావించినా, కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు.
2018 ఎన్నికల్లో మళ్లీ పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి ఓటమి చెందారు.అయితే అప్పటి నుంచి ఆయనకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యం దక్కకపోవడం, ఎమ్మెల్సీ స్థానం దక్కకపోవడం, నిధుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం, నియోజకవర్గంలో ఇతరుల పెత్తనం పెరిగిపోతుండటం లో ఒక దశలో తుమ్మల పార్టీ మారతారని ప్రచారం జరిగింది.
చాలా కాలంగా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగానే ఉంటూ వస్తున్నారు.అయితే నాగేశ్వరరావుకు ప్రాధాన్యం పెంచడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కమ్మ సామాజిక వర్గం లో పార్టీపై ఆదరణ పెరుగుతుంది అని కేసీఆర్ డిసైడ్ అయ్యారట.
అందుకే పార్టీ కార్యక్రమాల్లో తుమ్మల నాగేశ్వరరావు ను టీఆర్ఎస్ తరపున యాక్టీవ్ అవ్వాలి అని సూచించిందట.భవిష్యత్తులో కీలకమైన పదవి ఇస్తామని హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ తుమ్మల యాక్టివ్ అయ్యారు.ఈ సందర్భంగా పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం చేస్తున్న వారికి నాగేశ్వరరావు వార్నింగ్ కూడా ఇచ్చారు.తాతా మధు అభినందన సభలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.కొంతమంది పార్టీ నాశనం చేయాలని చూస్తున్నారని, వారి వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాన్ని టీఆర్ఎస్ అధిష్టానానికి సూచించారు.