ఏపీలో ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా తారుమారు అయినట్లు కనిపిస్తోంది.పార్టీని మరింత బలోపేతం చేసి, పార్టీ నాయకుల్లో మరింత ఉత్సాహం పెంచాలని చంద్రబాబు నిరంతరం కష్టపడుతున్నా, ఆ పార్టీ నాయకుల్లో మాత్రం ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు సరి కదా, పూర్తిగా నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయారు.పార్టీ కార్యక్రమాల్లో కాని , పార్టీని పరుగులు తీసే విషయంలో టిడిపి నాయకులు అంతా దూరంగా ఉంటున్నారు.2019 ఇది ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున చాలామంది కొత్త వారికి టికెట్లు దక్కాయి.కేవలం టికెట్ కోసం పార్టీలో చేరిన చాలామంది అటువంటి నాయకులకు చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి మరీ ప్రోత్సహించారు.కానీ ఎన్నికల్లో వారు ఘోర పరాజయం పాలవడంతో అప్పటి నుంచి మొహం చాటేశారు.
పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించాలని పదే పదే సూచిస్తున్నా, స్పందించే వారు కరువయ్యారు.అసలు చాలా నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాయకులూ కరువయ్యారు.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు చూస్తున్నారు.పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలు పోరాటాలు చేయడం ద్వారా నూతన ఉత్సాహం తీసుకురావచ్చని చూస్తున్నారు.
కానీ తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్టివ్ గా ఆ కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేకపోవడంతో, టిడిపి లో అన్ని పదవులను ప్రక్షాళన చేసి ఉత్సాహంతో ఆ పదవులను భర్తీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

ఈ తరుణంలో ఈ నెల 27వ తేదీన అధికారికంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి అచ్చెనాయుడు పేరుని ప్రకటించబోతున్నారు.ఆ పదవితో పాటు, పార్టీలోని అన్ని పదవుల్లోనూ, ఉత్సాహవంతంగా ఉండే వారితో నియమించాలని చూస్తున్నారు.ఈ మేరకు జిల్లాల వారీగా నాయకుల వివరాలను సేకరిస్తూ, వారితో సంప్రదింపులు చేస్తున్నా, వారెవరు పార్టీ పదవులను స్వీకరించేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి వ్యవహారాలు చేసినా, ఆషామాషీగా వదిలిపెట్టరని, తమను కాపాడేందుకు పార్టీ కూడా చేతులెత్తేసే పరిస్థితి ఉంటుందని అభిప్రాయపడుతున్నారట.అందుకే పదవులు తీసుకోవాలని పార్టీ నుంచి పదేపదే పిలుపులో వస్తున్నా, నాయకులు మాత్రం పెద్ద ఆసక్తి చూపించకపోవడంతో, త్వరలో అన్ని కమిటీలను ప్రక్షాళన చేసి కొత్తగా భర్తీ చేపడదామని చూస్తున్నా, ఫలితం మాత్రం కనిపించడం లేదని తెలుస్తోంది.