ఉత్తర అమెరికా తెలుగు సంఘం.( తానా) ప్రపంచంలోని తెలుగు సంఘాలన్నిటిలో అతిపెద్ద తెలుగు సంస్థ.
ఈ సంస్థకు ప్రతీ సారి ఏకగ్రీవంగా ఎన్నికలు జరుగుతున్నా 2021 ఎన్నికలు మాత్రం తానా సంస్కృతికి భిన్నంగా జరిగాయి.తానాలో కూడా ఓటింగ్ ప్రకారం కమిటీను ఎన్నుకోవాలని యువత , కీలక సభ్యులు పట్టుబట్టడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి.
కొన్ని రోజుల క్రితం ఈ ఎన్నికలకు సంభందించి ఫలితాలు కూడా వెలువడ్డాయి.ఇందులో శృంగవరపు నిరంజన్ ప్యానల్ విజయం సాధించిన విషయం కూడా విదితమే.
అయితే ఎన్నికలలో అవకతవకలు జరిగాయని, ఎన్నికలు జరిగిన సరళిపై తమకు అనుమానాలు ఉన్నాయని కొడాలి నరేన్ ప్యానల్ ఫలితాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది.అత్యవసర బోర్డ్ సమావేశం ఏర్పాటు చేయాలని, ఫలితాలపై చర్చలు జరిగే వరకూ ఫలితాలు వెల్లడించ వద్దని తానా బోర్డ్ మరియు ఎన్నికల కమిటీని కోరారు.
ఎన్నికల ప్రక్రియ మరియు కొన్ని విషయాలలో పారదర్సకత లోపించిందని, పోటీ చేసే వారికి ఎన్నికల కమిటీ సభ్యులు సరైన సమాచారాన్ని అందించలేకపోయారని ఫిర్యాదులో తెలిపారు.

అలాగే ఎన్నికలకు వాడిన కౌంటింగ్ యంత్రాలను ముందుగా క్రమాంకనం చేయలేదని, గడువు తేదీ కంటే ముందుగానే వచ్చిన బ్యాలెట్ లకు ఆమోదం తెలుపలేదని అలా ఎందుకు చేశారో చెప్పాలని వినతి పత్రంలో పొందు పరిచారు.అలాగే వైట్ నార్ పెట్టిన బ్యాలెట్ ల లెక్కింపుపై ఎలాంటి చర్చలు పెట్టకుండానే లెక్కించారని అలా ఎందుకు జరిగిందని కోరారు, అధికారిక కవర్లు లేని బ్యాలెట్లను కుడా లెక్కించారని,ఒక్క కవర్ లో ఎక్కువగా వచ్చిన బ్యాలెట్ పత్రాలను లెక్కించారని ఇది సరైనది కాదని ఈ విషయాలపై బోర్డ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి బ్యాలెట్ పత్రాలను యంత్రాలతో చేతితో లెక్కించేలా చర్యలు చేపట్టాలని ఆ తరువాత మాత్రమే ఫలితాలు వెల్లడించాలని కోరారు కొడాలి నరేన్ ప్యానల్.