తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇక ముగిసిన అధ్యాయమే అన్నట్లుగా అందరిలోనూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఏదో రకంగా పార్టీ లో ఉత్సాహం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నం చేస్తూనే వస్తోంది.ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా , రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు తప్పకుండా మంచి రోజులు వస్తాయని పార్టీ అధిష్టానం అభిప్రాయపడుతోంది.
అందుకే పార్టీ పరిస్థితి మెరుగుపరిచేందుకు రంగంలోకి దిగింది.కొత్త పిసిసి అధ్యక్షుడిని ఎంపికచేసి సరికొత్త రూట్లో కాంగ్రెస్ ను విజయంవైపు నడిపించేందుకు సరికొత్త ప్లాన్ చేస్తోంది.
దీనిలో భాగంగానే కొద్ది రోజులుగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడి నియామకం పై దృష్టి పెట్టింది.
ఈ మేరకు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ కొద్దిరోజులుగా తెలంగాణ లో మకాం వేసి మరి పార్టీ నాయకుల అభిప్రాయాలను సేకరించి, ఢిల్లీకి వెళ్లారు.
కొత్త పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై సేకరించిన అభిప్రాయాలతో పాటు, అధిష్టానం నిర్ణయం ఏమిటి అనేది ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత, కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక ఉండబోతోంది.ఇది ఎలా ఉంటే రేవంత్ రెడ్డి తో పాటు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి , జగ్గారెడ్డి ,దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇలా చాలా మంది పిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.
ఎక్కువగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరి లో ఒకరికి ఛాన్స్ ఉండే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఇది ఇలా ఉండగానే అకస్మాత్తుగా కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో నేడు ఢిల్లీకి రేవంత్ వెళుతున్నారు.ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో జరగబోతున్న డిఫెన్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు.ఈ సమావేశం రాహుల్ గాంధీ కూడా పాల్గొనబోతుండడం , అనంతరం రాహుల్ తో రేవంత్ ప్రత్యేకంగా భేటీ అవుతుండడం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రేవంత్ పిసిసి అధ్యక్షుడిగా అధిష్టానం నిర్ణయించిందని, ఆ మేరకు ఆయన తో చర్చించి ప్రకటన త్వరలోనే చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాహుల్ రేవంత్ భేటీ అవుతున్నారనే సమాచారం మిగతా కాంగ్రెస్ సీనియర్లలో ఇప్పుడు దడ పుట్టిస్తోంది.
నేడు రాహుల్ ,రేవంత్ ఒక క్లారిటీ రాబోతున్న తరుణంలో, అతి త్వరలోనే కొత్త పిసిసి అధ్యక్షుడు ఎంపికపై ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.ఢిల్లీ పర్యటన పై రేవంత్ అనుచరులు అప్పుడే ఆనందంలో మునిగిపోయారు.