జాతీయ రహదారిపై వర్షపునీరు నిలిచింది

నల్లగొండ జిల్లా: పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయినట్లుగా కోదాడ- జడ్చర్ల 167వ జాతీయ రహదారి నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ల,పర్యవేక్షణ చేసిన అధికారుల పనితీరు ఉందని వాహనదారులు మండిపడుతున్నారు.

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం సాగర్ రోడ్డులోని కోదాడ- జడ్చర్ల 167వ జాతీయ రహదారిని లోపభూయిష్టంగా నిర్మాణం చేశారని,తేలికపాటి వర్షానికి జాతీయ రహదారిపై నీరు నిలిచి చిన్నపాటి కుంటను తలపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాంట్రాక్టర్ల కక్కుర్తి, అధికారుల అలసత్వం కలసి పని చేస్తే ఇలాగే ఉంటుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై చిన్న వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే వర్షా కాలంలో రోడ్డు పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

రోడ్డుపై నీరు నిలిస్తే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.ఇదిలా ఉంటే రోడ్డు ప్రక్కనే చెత్తాచెదారం వేయడంతో దుర్వాసన వెదజల్లుతుందని వాహన చోదకులు అంటున్నారు.

ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకముందే నీరు రహదారిపై నిలవకుండా ఉండేందుకు, చెత్తను రోడ్డు పక్కన వేయకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు,ప్రజలు కోరుతున్నారు.

Advertisement
కాంట్రాక్ట్ పోస్టింగులపై కాంట్రాక్టర్ వ్యాపారమా...?

Latest Nalgonda News