నత్త నడకన ' నల్లారి ' రాజకీయం ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెట్టు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి( Nallari kiran kumar reddy, ) రెండు నెలల క్రితమే బిజెపిలో చేరారు.

ఆయనకు బిజెపి అధిష్టానం పెద్దలు తగిన ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, ఏపీ తెలంగాణలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభావం ఉంటుందని, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో బిజెపికి ఆదరణ పెంచే విధంగా కిరణ్ రాజకీయ వ్యూహాలు పనిచేస్తాయనే లెక్కల్లో ఆయనను పార్టీలో చేర్చుకున్నారు.

ఏపీ తెలంగాణలో విస్తృతంగా రాజకీయ పరిచయాలు ఉండడంతో, ఆయన ద్వారా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని అంచనా వేశారు.అలాగే ఆయన ద్వారా ఏపీ తెలంగాణలోనూ బిజెపిని బలోపేతం చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని ఎన్నో ఆశలతో కిరణ్ కు కాషాయ జెండా కప్పినా, ఆయన మాత్రం ఆశించిన స్థాయిలో అయితే యాక్టివ్ గా ఉండకపోవడం చర్చనీయాంశంగా మారింది.

కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరిన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బిజెపి బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, పెద్ద ఎత్తున చేరికలు జరిగే విధంగా చూస్తానని బిజెపి( BJP ) పెద్దల వద్ద ప్రస్తావించారు.అంతేకాకుండా బీజేపీ వ్యతిరేక పార్టీలపైన తాను పోరాటం చేస్తానని, దీనిలో భాగంగానే ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహిస్తానని ఆర్పాటంగా ప్రకటించారు.

కానీ ఆయన చేరి నెలలు గడిచిపోతున్నా, ఇప్పటి వరకు మీడియా సమావేశం నిర్వహించలేదు.అలా అని చేరికలను ప్రోత్సహించకపోవడం, యాక్టివ్ గా పని చేయకపోవడం వంటి వ్యవహారాలపై ఏపీ తెలంగాణ బిజెపి నాయకులలోను చర్చ జరుగుతుంది.కేవలం కాలం గడుపుకునేందుకే కిరణ్ బిజెపిలో చేరారా ? చేరి సైలెంట్ గా ఊరుకుంటే ప్రయోజనం ఏముంటుందనే ప్రశ్నలు ఎన్నో కిరణ్ కు ఎదురవుతున్నాయి.కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో ఏపీ, తెలంగాణలో ఆయన ద్వారా లబ్ధి పొందిన కీలక నేతలు సైతం కిరణ్ పిలుపుమేరకు బిజెపిలో చేరేందుకు అంత ఆసక్తి చూపించడం లేదట.

Advertisement

కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసినా నాయకుల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సైలెంట్ గా ఉన్నారట.ముఖ్యంగా ఏపీ, తెలంగాణలలోని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కొంతమంది కిరణ్ కు ఉన్న పరిచయాలతో బిజెపి కండువా కప్పుకుంటారనే ప్రచారం జరిగినా, అది వాస్తవ రూపం దాల్చలేదు.ఢిల్లీ పెద్దలతో పాటు, ఏపీ తెలంగాణలోని బిజెపి నాయకులు అంచనా వేసిన స్థాయిలో కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయం ముందుకు వెళ్ళకపోవడంపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

కిరణ్ బీజేపీ లో చేరినా, ఇప్పటి వరకు కలిగిన ప్రయోజనం ఏమీ లేదన్న నిట్టూర్పులు పార్టీ నేతలు నుంచి వ్యక్తమవుతున్నాయి.అయితే కిరణ్ వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నారా ? అసలు కిరణ్ రాజకీయం ఏమిటి అనేది ఎవరికి అంత పట్టడం లేదు.

Advertisement

తాజా వార్తలు