అతి త్వరలోనే టీడీపీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్, రాజకీయంగా మరింత పట్టు సాధించేందుకు పార్టీలోనూ, ప్రజల్లోనూ బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు.ఈ మేరకు చంద్రబాబు సైతం లోకేష్ కోసం తెరవెనుక వ్యూహాలు రచిస్తూ వస్తున్నారు.
అసలు కరోనా ప్రభావం లేకపోయి ఉంటే ఇప్పటికే లోకేష్ ను ప్రమోట్ చేసే కార్యక్రమం శరవేగంగా జరిగి ఉండేది అనే అభిప్రాయం పార్టీ నాయకుల్లోనూ ఉంది.ఇదిలా ఉంటే లోకేష్ అతి త్వరలోనే సైకిల్ యాత్ర చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా, ఈ మేరకు ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది .ఈ విషయంలో వాస్తవం ఉన్నా, ఈ అంశాలన్నింటినీ బయట పెట్టింది మాత్రం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.
అసలు అవకాశం దొరికితే చంద్రబాబు, లోకేష్ పై సెటైర్లు వేస్తూ, విమర్శలు చేసే విజయసాయిరెడ్డి ఇప్పుడు అదేవిధంగా లోకేష్ యాత్ర విషయాలను బయటపెట్టారు.ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, విజయసాయిరెడ్డి ప్రస్తావించారు.” పార్టీ వ్యవహారాలను కొడుకుకి అప్పగించాలని బాబు గారు అనుకుంటున్నారా, వయసు పెరగడం జ్ఞాపకశక్తి క్షీణించడం తో కుమారుడికి పగ్గాలు ఇస్తారంట.కరోనా ఉధృత గానే లోకేష్ నాయుడు కాబోయే సీఎం గా ఎలివేట్ చేసేలా సైకిల్ యాత్ర చేయించాలని ఎల్లో మీడియా ముఖ్యులు రూట్ మ్యాప్ ఇచ్చారంట.” అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడంతో రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.
ఆషామాషీగా అయితే విజయసాయిరెడ్డి ఈ ఆరోపణలు చేయలేదని ఖచ్చితంగా ఆయనకు లోకేష్ యాత్ర పై సమాచారం ఉందని టిడిపి అనుమానిస్తోంది.వాస్తవంగా ఎప్పటి నుంచో లోకేష్ తో సైకిల్ యాత్ర చేయించి, ఆయనకి పార్టీలోనూ, ప్రజల్లోనూ పట్టు పెరిగే విధంగా చేయాలనే అభిప్రాయంతో చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు ఉన్నారు.
పాదయాత్ర చేసే అవకాశం ఎలాగూ లేదు కాబట్టి సైకిల్ యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అయ్యేలా, చంద్రబాబు ఇమేజ్ మరింత పెరిగేలా చేయాలనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్టుగా, ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే లోకేష్ బరువు తగ్గడం, లాక్‌డౌన్ సమయంలో సైకిల్ తొక్కుతూ ప్రాక్టీస్ చేయడం వంటి పరిణామాలన్నీ దీనికి సంకేతాలుగా రాజకీయ వర్గాల్లోనూ ప్రచారం జరుగుతోంది.