తెలంగాణ ముఖ్యమంత్రి, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మంత్రి అవుతారు అనే విషయం అందరికి కీ తెలిసిందే.అయినా ఆమె ఎప్పుడు ఆ పదవిలో కూర్చుంటారు అనేది మాత్రం ఎవరికి క్లారిటీ లేదు.
ఇటీవల నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా కవిత గెలిచారు.దీంతో వెంటనే మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టి ఆమెకు కీలకమైన మంత్రిత్వ శాఖలను అప్పగిస్తారని ప్రచారం జరిగినా, దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయాన్ని కెసిఆర్ వాయిదా వేస్తూ వచ్చారు.
ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికల తంతు ముగిసింది.దీంతో మరోసారి కవిత మంత్రి పదవి విషయం చర్చనీయాంశంగా మారింది.
ఆమెను మంత్రి గా చేస్తే పార్టీకి ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుందని, రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనే క్రమంలో కవిత సత్తా చాటగలదు అని, ఎన్నో రకాల విశ్లేషణలు వచ్చాయి.అయితే కెసిఆర్ మనసులో ఏముంది అనేది మాత్రం ఎవరికీ అంతుబట్టడంలేదు.
ఇదిలా ఉంటే కరీంనగర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మీరు కొత్త తెలుగు సంవత్సరం నాటికి మంత్రి అవుతారా అంటూ విలేకరులు ప్రశ్నించగా, అప్పటి వరకు ఎందుకు అంటూ కవిత వ్యాఖ్యానించారు.
సంక్రాంతికి ముందే మంత్రి అవుతారా అంటూ మరోసారి విలేకరులు ప్రశ్నించగా .అవును అన్నట్లు సైగ చేయడం తో కొత్త సంవత్సరం లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే విషయం అర్థం అవుతోంది.

ప్రస్తుతం టీఆర్ఎస్ క్యాబినెట్ లో ముగ్గురు మంత్రులను తప్పిస్తారు అని ప్రచారం జరుగుతోంది.ఆ ముగ్గురు స్థానంలో కవితతో పాటు, మరో ఇద్దరికీ అవకాశం కల్పించే ఆలోచనలో కెసిఆర్ ఉన్నట్లు సమాచారం.ఇదే విషయాన్ని కవిత ఈ విధంగా బయటపెట్టినట్లు కనిపించారు.ప్రస్తుతం బిజెపి తెలంగాణలో గట్టి పోటీ ఇచ్చే స్థాయికి వెళ్లడం, అగ్ర నాయకులు సైతం తెలంగాణపై దృష్టి పెట్టి తెలంగాణ బిజెపి నాయకులను మరింత టార్గెట్ చేయడం, టిఆర్ఎస్ ను పూర్తిగా టార్గెట్ చేసుకోవడం వంటి వ్యవహారాలతో ఆలస్యం చేయకుండా మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టి, కవితను యాక్టివ్ చేసి, రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉండేలా చేసుకోవాలనే ఆలోచనలో కెసిఆర్ ఉన్నట్టు కనిపిస్తున్నారు.
పనిలో పనిగా కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ఏది ఏమైనా కొత్త సంవత్సరంలో మాత్రం టిఆర్ఎస్ లో ఎన్నో కీలకమైన మార్పుచేర్పులు చోటుచేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.