నేతలు ఒంటిపై బట్టలు మార్చినంత ఈజీ గా పార్టీలు మారుస్తూ ఉంటారు.నిన్న ఒక పార్టీలో కొనసాగిన నేతలు ఈ రోజు మరో పార్టీ కి జంప్ చేస్తూ పదవులను స్వీకరించాలి అని చూస్తూ ఉంటారు.
అయితే ఇలాంటి సమయంలో కొన్ని కొన్ని సార్లు నేతలు బహిరంగ సమావేశాల్లో మాట్లాడేటప్పుడు తప్పులో కాలేస్తూ అడ్డంగా దొరికిపోతూ ఉంటారు.అలాంటి ఘటనే బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా విషయంలో జరిగింది.
ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లి బీజేపీ లో చేరిన విషయం విదితమే.అయితే త్వరలో మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించింది బీజేపీ.
ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా అలవాటులో పొరపాటుగా నోరుజారి తప్పులో కాలేశారు.మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లాలోని దబ్రాలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గన్న ఆయన అలవాటులో పొరపాటుగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేయాలని సభకు హాజరైన ప్రజలకు పిలుపునివ్వడం విశేషం.
అయితే దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడం తో సింధియా తప్పులో కాలేసిన విషయం వెలుగులోకి వచ్చింది.ఈ వీడియోలో ‘ దబ్రా ప్రజలారా.
ఈనెల 3న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేయండి.ఇందుకు గానూ చేయెత్తి నాకు, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు నమ్మకం కలిగించండి’ అని పిలుపునిచ్చారు.
అయితే ఆ తరువాత తన తప్పు లో కాలేసిన విషయం తెలుసుకుని తేరుకున్న ఆయన తన వ్యాఖ్యలను సవరించుకుంటూ బీజేపీ గుర్తు అయిన కమలానికి ఓటేయాలంటూ కోరారు.దీంతో సింధియా చేసిన వ్యాఖ్యలు, ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్‌గా మారాయి.
దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది మాట్లాడుతూ….ఒక్కొక్క సమయంలో ఏ వ్యక్తికి అయినా తడబాటు సాధ్యమేనంటూ సింధియా చర్యను వెనకేసుకువచ్చారు.2012 నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చిన సింధియా ఈ ఏడాది మార్చి లోనే బీజేపీ లో చేరిన విషయం విదితమే.బీజేపీ లో చేరినప్పటికీ ప్రచార సమయంలో మాత్రం అలవాటులో పొరపాటు లా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.