తెలంగాణ ఎన్నికలలో వెనక్కి తగ్గకండి.. పవన్ కళ్యాణ్ జనసేన తెలంగాణ నాయకుల విజ్ఞప్తి

తెలంగాణ శాసన సభ ఎన్నికలలో జనసేన పోటీ చేయవలసిందేనని జనసేన తెలంగాణ నాయకులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో మంగళవారం రాత్రి జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు.

తెలంగాణాలో జరగనున్న శాసనసభ ఎన్నికల సన్నద్ధతపై పవన్ కళ్యాణ్ పోటీ చేయదలచుకున్న అభ్యర్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.2018లో కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదన్న ఉద్దేశంతో పోటీ చేయరాదన్న అధ్యక్షుని అభిప్రాయాన్ని గౌరవించి పోటీకి పట్టుపట్టలేదని, మిత్రపక్షమైన బి.జె.పి. విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ నుంచి విరమించుకున్నామని, ఈసారి తప్పనిసరిగా పోటీచేయవలసిందేనని ముక్త కంఠంతో కోరారు.ఎన్నాళ్ళ నుంచో ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నామని, ఈ దఫా పోటీ చేయకపోతే తెలంగాణాలో పార్టీ ఎదుగుదలను చేతులారా ఆపుకున్నట్లేనని అభిప్రాయపడ్డారు.

ప్రజల ముందుకు భవిషత్తులో బలంగా వెళ్లడం కష్టమేనని, క్యాడర్ నిరుత్సాహానికి గురవుతారని స్పష్టం చేశారు.నేతల అభిప్రాయాలను విన్న పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పరిస్థితులను తానూ అర్ధం చేసుకోగలని, అయితే తన మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని, అయితే నాయకులు, జన సైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని అన్నారు.

సరైన నిర్ణయం తీసుకోడానికి ఒకటిరెండు రోజుల సమయం అవసరమని తెలిపారు.పరిస్థితులు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉన్నందున సానుకూల నిర్ణయం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి, తెలంగాణ శాఖ ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు రామ్ తాళ్లూరి, హైదరాబాద్ నగర అధ్యక్షుడు ఆర్.రాజలింగం, ప్రధాన కార్యదర్శి ఎం.దామోదర్ రెడ్డి, వివిధ నియోజకవర్గాల ఇంచార్జిలు పాల్గొన్నారు.

Advertisement
Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్

తాజా వార్తలు