మొత్తానికి ఏపీ రాజకీయాల్లో జనసేన కీలకం అయ్యేలా చేసేసారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లోను జనసేన ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుందని, మొదటి నుంచి అంతా అంచనా వేసినా, మెల్లిమెల్లిగా ఆ పార్టీని బలోపేతం చేయడంలోనూ, రాజకీయంగా కీలకం చేయడం లోను పవన్ పైచేయి సాధించారు.
జనసేన పార్టీకి రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ ఉంటుందని, ఉత్తరాంధ్రలోను ఆ బలం మరింతగా పెంచుకుంటే తమకు తిరుగు ఉండదని లెక్కలు వేసుకుంటున్నారు.అందుకే ఏ పోరాటం మొదలుపెట్టినా, ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెడుతూ, ఆ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.
త్వరలోనే యువ గళం పేరుతో సభను నిర్వహించబోతున్నారు.
ఈనెల 12వ తేదీన యువజన దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల లో యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే ఆ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆ ప్రాంతంలో పర్యటిస్తూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగేలా చేస్తున్నారు.రాష్ట్రంలో తొలి కార్యక్రమంగా దీనిని భావిస్తున్న జనసేన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఎలాగు తమతో కలిసి వస్తుందని,

ఉత్తరాంధ్ర ప్రాంతంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న మత్స్యకారులను తమ పార్టీ వైపుకు తీసుకువస్తే ఆ బలం మరింతగా పెరుగుతుందని, సునాయాసంగా రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేందుకు దోహదపడుతుందని పవన్ అంచనా వేస్తున్నారు.అందుకే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారి మద్దతు కూడగట్టేందుకు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వలసల నివారణ, ఉపాధి మార్గాలకు అవసరమైన సూచనలు, సలహాలను ఇచ్చేందుకు వంద మంది యువతీ యువకులతో లావేరు మండలం తాళ్లవలసలో యువ శక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఈ సమావేశంలోనే వారితోనే తమ సమస్యలను చెప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు.జనసేన యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మత్స్యకార ప్రాంతాలకు చెందిన వారిని ఎక్కువగా ఈ సమావేశాలకు హాజరయ్యే విధంగా పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.మత్స్యకారులను, ఆ సామాజిక వర్గానికి చెందిన యువతను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకుంటే రానున్న రోజుల్లో తమకు ఇబ్బందులు ఉండవని, జనసేన బలం మరింతగా పెరుగుతుందని పవన్ అంచనా వేస్తున్నారు.
అందుకే వారి కోసమే ఈ ప్రాంతంలో వివిధ కార్యక్రమాలను రూపొందిస్తూ ఎక్కువగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పర్యటించేందుకు పవన్ మొగ్గు చూపిస్తున్నారు.