హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల విషయంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ఇటీవల ప్రకటించిన జనసేన పార్టీ తోలి జాబితా ను కూడా విడుదల చేస్తాను అంటూ ప్రకటించింది.
అయితే ఎన్నికల నామినేషన్ చివరి రోజున జనసేన పార్టీ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి అని తమ పూర్తి మద్దతు బీజేపీ కే అంటూ జనసేన ప్రకటించింది.
గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన పార్టీ ప్రకటించడమే కాకుండా నిన్న (నవంబర్ 19) కూడా 27 మందితో కూడిన జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను కూడా రిలీజ్ చేస్తామంటూ ఆ పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటించారు.అయితే ఇంకా జనసేన నేతలు,అభిమానులు అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్న ఈ సమయంలో ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ ఇద్దరూ పవన్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు.
పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు ఈ ఎన్నికలపై చర్చించిన అనంతరం పవన్ కళ్యాణ్ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
అంతేకాకుండా ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్టు పవన్ ప్రకటించారు.
జనసేన పార్టీ నేతలు, పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు తీవ్ర నిరుత్సాహానికి గురైనా కూడా దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నామని జనసేన అధినేత తెలిపారు.ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ కేడర్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
హడావిడిగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం, అలాగే, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదరలేదని రాబోయే ఎన్నికల్లో కలసి పని చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు.

అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తేల్చి చెప్పడమే కాకుండా జనసేనతో పొత్తు లేదని స్పష్టం చేశారు.అసలు జనసేన పార్టీతో పొత్తు అంశం బీజేపీలో చర్చకే రాలేదని.అలాగే పొత్తులపై జనసేన నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని బండి సంజయ్ స్పష్టంచేశారు.