తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తుందో ? ఎప్పుడు ఇస్తుందో తెలియదు కానీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఈ విషయంలో తెలంగాణ నేతలను బాగా ఇబ్బంది పెడుతోంది.ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న, పెట్టుకుంటున్న నాయకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ వస్తోంది.
ఎవరికి వారే కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టిలో పడేందుకు రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.తమకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే చాలు, పార్టీని ఫలానా విధంగా అధికారంలోకి తీసుకు వస్తాము అంటూ చెబుతున్న నాయకులకు కొదవేలేదు.
అంతేకాదు ఈ పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదు ఫలానా వ్యక్తికి మాత్రం ఇస్తే ఊరుకునేది లేదు అన్నట్లుగా అధిష్టానానికి వార్నింగ్ ఇచ్చే స్థాయికి తెలంగాణలోని కొంత మంది సీనియర్ నాయకులు వచ్చేసారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, ఇలా ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి.
అయితే రెడ్డి సామాజిక వర్గానికి పిసిసి అధ్యక్ష పదవి దక్కే ఛాన్స్ ఉండడంతో, ఆ సామాజిక వర్గం నేతలు ఎక్కువగా పోటీ పడుతున్నారు.ఇప్పుడు ఈ లిస్ట్ లోకి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వచ్చి చేరారు.
ప్రస్తుతం నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జానారెడ్డి ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తాం అని, సుదీర్ఘంగా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, పరిచయాలు ఉండటంతో గెలుపు తనకే దక్కుతుందని, టీఆర్ఎస్, బీజేపి రెండు పార్టీలను జనాలు పట్టించుకోరు అని జానా రెడ్డి నమ్ముతున్నారు.ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే తనకే పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలి అనే సంకేతాలను సైతం జానారెడ్డి అధిష్టానానికి పంపిస్తున్నారట .