తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈనెల 14వ తేదీన తిరుపతి ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం జగన్ రాబోతున్నారు అనే సమాచారంతో ఇప్పటివరకు వైసీపీ శ్రేణులు మంచి ఉత్సాహంగా ఉన్నాయి.ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ, కీలకమైన విశాఖ, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి సైతం జగన్ హాజరు కాలేదు.
అయితే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం కావడం తో , జగన్ ఎన్నికల ప్రచారానికి దిగాలని భావించారు.ఈ మేరకు ఈనెల 14వ తేదీన ప్రచార షెడ్యూల్ కూడా ఖరారు అయింది.
అయితే దీనిపై టిడిపి ,బిజెపి, జనసేన పార్టీలు విమర్శలు చేశాయి.
వైసీపీకి ఇక్కడ ఓటమి భయం ఉందని, అందుకే స్వయంగా జగన్ ఎన్నికల ప్రచారానికి దిగుతున్నారని ఎద్దేవా చేశాయి.
అయితే ఇప్పుడు అనూహ్యంగా జగన్ తిరుపతి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను జగన్ రద్దు చేసుకున్నారు.దీనిపై వివరణ సైతం ప్రజలకు ఇచ్చారు.
తిరుపతి ప్రజలను ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖలో జగన్ అన్ని విషయాలను ప్రస్తావించారు.ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాధి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, తాను ఎన్నికల ప్రచారానికి రావడంలేదని, ఒక్క రోజులోనే ఏపీలో 2765 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అని, అనేక చోట్ల కరోనా మరణాలు సైతం సంభవించాయని, ఈ పరిస్థితుల్లో తాను తిరుపతిలో ఎన్నికల ప్రచారానికి వస్తే పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు వస్తారని, ప్రజల ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా తాను తిరుపతి ఎన్నికల ప్రచారానికి రావడంలేదని తన లేఖలో ప్రజలకు వివరించారు.