డబ్బు కోసం ఎలాంటి అనుమతులు లేకుండా అమెరికాలోకి ప్రవేశిస్తున్న వారికి సాయం చేసినందుకు గాను భారతీయ ఉబెర్ డ్రైవర్‌కు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.30 ఏళ్ల జస్వీందర్ సింగ్ ఫిలడెల్ఫీయాలో నివసిస్తున్నాడు.సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో అతను చట్టవిరుద్ధంగా విదేశీయులను అమెరికాలోకి రవాణా చేసినట్లు తేలడంతో జస్వీందర్‌కు జైలుశిక్ష విధించినట్లు యునైటెడ్ స్టేట్స్ అటార్నీ గ్రాంట్ జాక్విత్ తెలిపారు.
ఉపాధి కోసం ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న జస్వీందర్ జనవరి 1, 2019 నుంచి మే 20, 2019 మధ్య కాలంలో చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించిన వారిని దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించినట్లుగా తేలింది.
న్యాయవిచారణలో అతను నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు వారి నుంచి పెద్ద మొత్తంలో నగదును తీసుకున్నట్లు తెలిపాడు.

మే 20, 2019న జస్వీందర్ కెనడా నుంచి చట్టవిరుద్ధంగా న్యూయార్క్‌లోని ఓ ప్రాంతానికి ఒక చిన్నారి సహా ఇద్దరిని తన కారులో తీసుకెళ్తుండగా పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.ఇందుకు గాను 2,200 డాలర్లను వసూలు చేసినట్లుగా దర్యాప్తులో తేలింది.శరణార్ధిగా అమెరికాలో ఆశ్రయం పొందుతున్న జస్వీందర్ ఈ నేరం కారణంగా జైలు శిక్ష అనంతరం యూఎస్ నుంచి బహిష్కరణకు గురికానున్నాడు.
యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి డేవిడ్ ఎన్ హర్డ్ తీర్పు సందర్భంగా మాట్లాడుతూ.జైలు నుంచి జస్వీందర్ బహిష్కరణకు గురికాని పక్షంలో అతనికి రెండేళ్ల పర్యవేక్షణ జైలు ఉంటుందని తెలిపారు.
—