ఖలిస్తాన్( Khalistan ) ఉగ్రవాది , ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ఏడాది పూర్తయిన సందర్భంగా కెనడా పార్లమెంట్‌లో ఆయనకు నివాళులర్పించడం, స్వయంగా ఎంపీలు లేచి నిలబడి మౌనం పాటించడం విమర్శలకు దారి తీస్తోంది.భారత ప్రభుత్వం ఒక ఉగ్రవాదిగా ప్రకటించిన వ్యక్తికి ట్రూడో సర్కార్ ఈ స్థాయిలో గౌరవం ఎందుకు కల్పిస్తోందని నెటిజన్లు భగ్గుమంటున్నారు.
తాజాగా భారత సంతతికి చెందిన కెనడియన్ ఎంపీ చంద్ర ఆర్య( Canadian MP Chandra Arya ) సైతం సొంత పార్టీ, సొంత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిజ్జర్‌కు ఈ స్థాయిలో గౌరవం సరికాదన్నారు.
గ్లోబ్ అండ్ మెయిల్ ప్రకారం.కెనడియన్ ఎంపీ మాట్లాడుతూ తమ జీవితాల్లో ఎక్కువ భాగం దేశానికి సేవ చేసిన గొప్ప కెనడియన్లను గౌరవించటానికి పార్లమెంట్ సాధారణంగా ఒక నిమిషం మౌనం పాటిస్తుంది.
ఈ ప్రమాణాల ఆధారంగా నిజ్జర్ దీనికి అస్సలు సరిపోలేదంటూ చంద్ర ఆర్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
అతనిని అత్యంత గౌరవనీయమైన కెనడియన్ల ర్యాంక్‌కు పెంచేందుకు ఆయనను విదేశీ ప్రభుత్వం చంపిందనే విశ్వసనీయ ఆరోపణలు అబద్ధమని ఆర్య తెలిపారు.ఖలిస్తాన్ తీవ్రవాదంలో నిజ్జర్ పాత్ర, తప్పుడు పాస్‌పోర్ట్‌తో దేశంలోకి ప్రవేశించడం సహా మరెన్నో అంశాలపై కెనడియన్ దినపత్రిక ది గ్లోబ్ అండ్ మెయిల్ ( The Globe and Mail )చేసిన పరిశోధనాత్మక నివేదికను చంద్ర ఆర్య ఎత్తి చూపారు.దేశం గర్వించే , దేశానికి సేవ చేసిన కెనడియన్లకు ఇలాంటి గౌరవాలు కేటాయించాలని ఆయన దుయ్యబట్టారు.
నిజ్జర్‌కు పార్లమెంట్‌లో మౌనం పాటించడంతో పాటు 1985 కనిష్క బాంబుదాడిని భారత ప్రభుత్వం ప్లాన్ చేసిందని ఖలిస్తాన్ తీవ్రవాదులు ప్రచారం చేసిన కుట్ర సిద్ధాంతాలను కూడా ఆర్య తప్పుబట్టారు.
కాగా.గతేడాది జూన్ 18న బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రే పట్టణంలోని ఓ గురుద్వారా వెలుపల హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.దీని వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం ఉందంటూ ట్రూడో వ్యాఖ్యానించారు.నిజ్జర్ స్వగ్రామం పంజాబ్‌లోని జలంధర్ నగర శివారులోని భార్‌సింగ్ పుర .1997లో కెనడాకు వలస వెళ్లిన నిజ్జర్ .అక్కడ ఖలిస్తాన్ వేర్పాటువాదులతో సన్నిహిత సంబంధాలు నెరిపేవాడు.ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ ఏర్పాటు చేసి భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు కెనడాలోని సిక్కు యువతలో ఖలిస్తాన్ భావజాలాన్ని నూరిపోసేవాడు.
దీంతో 2020లో భారత ప్రభుత్వం నిజ్జర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది.