ఆర్ధిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతీయులు దూసుకుపోతూ భారతదేశాన్ని గర్వపడేలా చేస్తున్నారు.అద్భుతమైన మేథస్సుతో మనవారు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఈ క్రమంలో పలు ప్రతిష్టాత్మక అవార్డులు సైతం భారతీయులను వరిస్తున్నాయి.తాజాగా భారత సంతతికి చెందిన అమెరికన్ శాస్త్రవేత్త రాజీవ్ జోషికి ప్రతిష్టాత్మక ‘ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్’’ పురస్కారం వరించింది.
ఐఐటీ బాంబే నుంచి ఇంజనీరింగ్ పట్టా అందుకున్న జోషీ.అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి ఎం.ఎస్ పట్టా పొందారు.అనంతరం కొలంబియా యూనివర్సిటీలో మెకానికల్ / ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.
ప్రస్తుతం టెక్నాలజీ దిగ్గజం ఐబీఎంకు చెందిన ‘‘ ఐబీఎం థామ్సన్ వాట్సన్ రీసెర్చ్ సెంటర్’’లో ఆయన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.తన అద్భుతమైన మేథస్సుతో ప్రాసెసర్లు, సూపర్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, అత్యాధునిక గ్యాడ్జెట్లు సహా అనేక పరికరాలను జోషి ఆవిష్కరించారు.

ఎలక్ట్రానిక్, కృత్రిమ మేధ రంగాల్లో ఆయన అందించిన సేవలను గుర్తించిన ‘‘ న్యూయార్క్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా అసోసియేషన్’’ రాజీవ్ జోషిని ‘‘ ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్’’ పురస్కారానికి ఎంపిక చేసింది.దీనిపై స్పందించిన రాజీవ్ జోషి… అవసరం, తపన తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని ఆయన అన్నారు.సమస్యల్ని గుర్తించి వాటిని పరిష్కరించాలనే ఆతృతే తనని ముందుకు నడిపిస్తోందని రాజీవ్ వ్యాఖ్యానించారు.ప్రఖ్యాత శాస్త్రవేత్తలు మార్కోనీ, మేడం క్యూరీ, రైట్ బ్రదర్స్, జేమ్స్ వాట్ వంటి వారి గురించి తన చిన్నప్పుడు అమ్మానాన్నలు చెప్పేవారని ఆయన గుర్తుచేసుకున్నారు.
ఆ మహానీయుల విజయాలు తనలో స్ఫూర్తిని రగిలించిందని రాజీవ్ అన్నారు.రాబోయే రోజుల్లో క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ, క్లౌడ్ వినియోగం ఎక్కువవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.