2020లో చట్టం.. ఇన్నాళ్లకు కార్యరూపం, హ్యూస్టన్ పోస్టాఫీసుకు సిక్కు పోలీస్ అధికారి పేరు

విధి నిర్వహణలో వుండగా దుండగుడి చేతిలో కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయిన భారత సంతతి సిక్కు పోలీసు అధికారి సందీప్ సింగ్ ధలీవాల్‌కు అరుదైన గౌరవం లభించింది.

పశ్చిమ హ్యూస్టన్‌లోని హారిస్ కౌంటీ పోస్టాఫీసు పేరును సందీప్ సింగ్ ధలీవాల్ పోస్టాఫీసుగా మారుస్తూ అక్కడి యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తమ సహచరుడు డిప్యూటీ సందీప్ సింగ్ ధలీవాల్ జ్ఞాపకార్థం పశ్చిమ హారిస్ కౌంటీలో పోస్టాఫీసుకు ఆయన పేరును పెట్టి సత్కరించారని హారిస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం బుధవారం ట్వీట్ చేసింది.ఈ సందర్భంగా టెక్సాస్ అధికార యంత్రాంగం, హారిస్ కౌంటీ కమీషనర్స్ కోర్ట్, యూఎస్ పోస్టల్ డిపార్ట్‌మెంట్, సిక్కు కమ్యూనిటీకి కౌంటీ కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.

డిప్యూటీ సందీప్ సింగ్ ధలీవాల్ పోస్టాఫీసును ఆయనకు అంకితం చేసేందుకు గాను హ్యూస్టన్ సిక్కు సంఘం, స్ధానిక అధికారులు, చట్టసభ సభ్యులు 315 అడిక్స్ హోవెల్ రోడ్‌లో మంగళవారం సమావేశమయ్యారు.కాగా, 2019 సెప్టెంబర్ 27న ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న సందీప్ సింగ్‌ను ఓ దుండగుడు తుపాకీతో కాల్చాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సందీప్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ నేపథ్యంలో ఆయన స్మారకార్థం హ్యూస్టన్‌లోని 315 అడిక్స్ హోవెల్ రోడ్డులో ఉన్న పోస్టాఫీసును ‘డిప్యూటీ సందీప్ సింగ్ ధలివాల్ పోస్టాఫీస్ భవనం’గా పేరు మార్చి ఆయనను అమెరికా ప్రభుత్వం గౌరవించింది.

Advertisement

అందుకు సంబంధించిన బిల్లుపై నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో అది చట్టంగా మారింది.తద్వారా అమెరికాలో భారత సంతతి వ్యక్తి పేరుతో ఉన్న రెండో పోస్టాఫీస్‌గా 315 అడిక్స్ హోవెల్ గుర్తింపు పొందనుంది.2006లో దక్షిణ కాలిఫోర్నియాలో కాంగ్రెస్‌ సభ్యుడు భారత అమెరికెన్‌ దలీప్‌ సింగ్‌ సౌండ్‌ పేరు పెట్టారు.టెక్సాస్‌లోని కాస్ట్రోవిల్లేలో ఉన్న మరో యూఎస్‌ ఆఫీసును ‘లాన్స్‌ కార్పోరల్‌ రొనాల్డ్‌ డైన్‌ రైర్డాన్‌ పోస్టాఫీస్‌’గా మార్చారు.

కాగా, సందీప్‌ను హత్య చేసిన నిందితుడికి ఈ కేసులో అక్కడి న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది.వృత్తి పట్ల ధలివాల్ అంకితభావం, త్యాగానికి గుర్తింపుగా అక్కడి ‘బెల్ట్‌వే 8 టోల్‌వే‘లో కొంత భాగానికి ఆయన పేరు పెట్టిన సంగతి తెలిసిందే.‘హెచ్‌సీఎస్ఓ డిప్యూటీ సందీప్ సింగ్ ధలివాల్ మెమోరియల్ టోల్‌వే’గా దీనికి నామకరణం చేశారు.10వేలకు పైగా సిక్కులు ఉండే హారిస్ కౌంటీలో తలపాగా, గడ్డంతో విధులు నిర్వహించిన తొలి సిక్కు వ్యక్తిగా ధలివాల్ వార్తల్లో నిలిచారు.2009లో అమెరికన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన ఆయన పదేళ్ల పాటు పలు హోదాల్లో కొనసాగారు.

Advertisement

తాజా వార్తలు