కమర్షియల్ అవసరాలకు గృహ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు...?

నల్లగొండ జిల్లా: హోటల్లు, టిఫిన్ సెంటర్లు,రెస్టారెంట్లు,కర్రీ పాయింట్,పర్మిట్ రూములు ఇలా మొదలుకొని ప్రతి ఒక్క షాపులో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడాలి.

కానీ,గ్యాస్ ఏజెన్సీలు అధిక డబ్బుకు ఆశపడి హోటళ్లకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దీంతో సాధారణ ప్రజలకు గృహ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉండడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నెలవారి మామూళ్లకు అలవాటుపడ్డ సివిల్ సప్లై అధికారులు హోటళ్లకు సబ్సిడీ సిలిండర్లు అందించడానికి సహకరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీంతో మిర్యాలగూడ పట్టణంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ జోరుగా సాగుతుంది.రోజుకు వేల సిలిండర్లు బ్లాక్ లో అమ్ముకొని గ్యాస్ ఏజెన్సీలు అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారని తెలుస్తుంది.

మిర్యాలగూడ పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు పట్టణంలోని నాలుగు ఏజెన్సీల ద్వారా మూడు కంపెనీ (హెచ్ పి, ఇండియన్,భారత్) ల గ్యాస్ రవాణా జరుగుతుంది.పట్టణంలో సుమారు టిఫిన్ సెంటర్లు,హోటల్లు,కర్రీ పాయింట్లకు రోజుకు 1000కి పైగా సిలిండర్ల అవసరం ఉంటుంది.కమర్షియల్ సిలిండర్ 19 కేజీలకు రూ.2087 కాగా సబ్సిడీ సిలిండర్ 15 కేజీలకు రూ.877 కు లభిస్తుంది.ఒక కమర్షియల్ సిలిండర్ బదులుగా రెండు సబ్సిడీ సిలిండర్లు వస్తుండడంతో హోటల్ యాజమాన్యాలు సబ్సిడీ సిలిండర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.ఇది అదునుగా భావించిన గ్యాస్ ఏజెన్సీలు ఒక్కో సిలిండర్ కు రూ.300 నుంచి రూ.400 మేర అధికంగా వసూలు చేసి కమర్షియల్ సిలిండర్లు వాడాల్సిన చోట సబ్సిడీ సిలిండర్లను అందజేస్తున్నారు.దీంతో రోజువారీగా గ్యాస్ ఏజెన్సీలు లక్షల రూపాయలు అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు.

Advertisement

దీంతో పాటు అవసరం లేకున్నా గ్యాస్ పొయ్యిలను అంటగట్టడం,పైపును అధిక ధరలకు విక్రయించడం ఏజెన్సీలకు అలవాటుగా మారింది.కమర్షియల్ సిలిండర్లు వాడకుండా సబ్సిడీ సిలిండర్లు వాడుతున్న కమర్షియల్ షాపులపై అధికారుల దాడులు చేయకపోవడంతో పాటు నెలవారి మామూళ్లకు అలవాటు పడ్డారనేది ప్రచారంలో ఉంది.హోటల్ స్థాయిని బట్టి నెలకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు నిర్వాహకులే తమ వారి వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది.సబ్సిడీ సిలిండర్లు వాడుతున్న షాపులపై దాడులు చేసి కేసు నమోదు చేయాల్సిన అధికారులు మామూళ్లకు అలవాటు పడడంతో ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా సబ్సిడీ సిలిండర్ల వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు.

గ్యాస్ బుక్ చేసుకున్న వారికి రెండు రోజుల్లో సిలిండర్ అందించాల్సి ఉంటుంది.కానీ, బ్లాక్ లో అమ్ముకోవడానికి అలవాటు పడిన ఏజెన్సీలు వారం రోజులపాటు గ్యాస్ ను అందించడం లేదని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు.డోర్ డెలివరీ ఇచ్చే సిలిండర్ కు రూ.877 తీసుకోవాల్సి ఉండగా 930 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.బ్లాక్ మార్కెట్లో ఏజెన్సీలు అమ్ముకుంటుండగా, సిలిండర్ల సప్లై చేసేవారు గృహాల వద్ద అధిక డబ్బు వసూలు చేస్తున్నట్లు పట్టణవాసులు పేర్కొంటున్నారు.

అక్రమాలకు పాల్పడుతున్న గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.కమర్షియల్ సిలిండర్లు వాడకుండా సబ్సిడీ సిలిండర్లను వాడుతున్న హోటల్ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని పలువురు కోరుతున్నారు.

నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తుల గడువు...2025 జనవరిలో పరీక్షల నిర్వహణ
Advertisement

Latest Nalgonda News