వేసవి కాలం రానే వచ్చింది.ఎండల దెబ్బకు అత్యవసరమైన పని ఉంటే తప్పా.ప్రజలు బయట కాలు కూడా పెట్టడం లేదు.ఇక వేసవి కాలంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.సాధారణంగా తమ బరువుతో పాటు కడుపులో పెరిగే బిడ్డ బరువును మోస్తుండటంతో ఇబ్బందికరంగా ఉంటుంది.అలాగే హార్మోనుల మార్పుల వల్ల శరీరంలో వేడి ఆవిర్లు, నీరు పట్టడం, అలసట, నీరసం వంటి సమస్యలతో గర్భిణీలు అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.
అందులోనూ వేసవి కాలంలో వేడి వాతావరణం కారణంగా ఈ సమస్యలు మరింత చికాకు పుట్టిస్తాయి.అందుకే సమ్మర్ సీజన్‌లో తప్పకుండా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా వేసవిలో గర్భిణీ స్త్రీలు లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి.పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, మంచి నీరు వంటివి తరచూ తీసుకుంటే డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటారు.

అలాగే గర్భిణీలు కాళ్ళ వాపులతో బాధ పడుతుంటారు.వేసవిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.ఈ సమస్యను తగ్గించుకోవాలంటే కాళ్ళను ఎత్తులో పెట్టుకోవాలి.ఇలా కాళ్ళు ఎత్తుగా పెట్టుకోవడం వల్ల పాదాలకు నీరు చేరదు.మరియు తీసుకునే ఆహారంలో ఉప్పును బాగా తగ్గించి తీసుకోవాలి.వేసవి కాలంలో గర్భిణీలు మెత్తగా మరియు వదలుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి.
ఎందుకంటే ఇవి చెమటను చాలా సులభంగా గ్రహించడమే కాకుండా సమ్మర్ హీట్ ను ఎదుర్కోవడానికి సహాయపడుతాయి.ఈ సీజన్‌లో గర్భిణీలు ఎక్కువ సమయం పాటు విశ్రాంతి తీసుకోవాలి.
వేసవి వేడిని అదిగమించాలంటే గోరు వెచ్చని నీటితో తలస్నానం చేస్తే మంచిది.ఇక ఈ సమ్మర్‌లో మసాలా వంటలు, మాంసాహారం, కూల్ డ్రింక్స్, కాఫీ, టీలు, ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం నివారించాలి.