ఎన్నికలు వచ్చాయంటే చాలు, ఎక్కడలేని సందడి నెలకొంటుంది.రాజకీయ పార్టీలు హడావుడి అంతా ఇంతా కాదు.
ఖచ్చితంగా తమ పార్టీ గెలిచి తీరాలనే కసి తో ప్రత్యర్థి పార్టీలను బలహీనం చేసేందుకు చేయని ప్రయత్నం అంటూ ఉండదు.ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇక్కడ ప్రధాన పోటీ బిజెపి టీఆర్ఎస్ మధ్య ఉంది అన్నట్లు వాతావరణం కనిపిస్తోంది.కాంగ్రెస్ ఇక్కడ గెలిచేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నా, ఇక్కడ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక దుబ్బాక ఉపఎన్నికలలో సాధించిన విజయంతో బిజెపి లో మంచి హుషారు కనిపిస్తోంది.ఖచ్చితంగా గ్రేటర్ పీఠం తామే దక్కించుకుంటాము అనే ధీమాతో కనిపిస్తోంది.టిఆర్ఎస్ సైతం మరో సారి ఇక్కడ విజయపతాకం తామే ఎగుర వేస్తాము అని, గ్రేటర్ పీఠం తప్పకుండా టిఆర్ఎస్ దక్కించుకుంటుంది అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే రెండు పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి బిజెపి ఈ విషయంలో కాస్త పై చేయి సాధిస్తున్నట్లు గా వ్యవహరిస్తోంది.
టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తి నాయకులను గుర్తించి తెలంగాణ బీజేపీ నాయకులు సదరు నాయకుల ఇళ్లకు వెళ్లి వారిని పార్టీలో చేరాలని ఆహ్వానించడం తో పాటు, వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామంటూ హామీలు ఇస్తూ ఉండడం వంటి వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయి.
టిఆర్ఎస్ పూర్తిగా కాంగ్రెస్ నేతలు, బీజేపీ గ్రేటర్ టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నాయకులను గుర్తించి, వారిని పార్టీలో చేర్చుకునే విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాయి.
ఇది ఇలా ఉంటే, టిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సమయంలో ఉద్యోగ సంఘాల తరఫున యాక్టివ్ గా పనిచేసి , కేసీఆర్ మెప్పు పొందిన స్వామి గౌడ్ ఆ తర్వాత ఎమ్మెల్సీ గా టిఆర్ఎస్ నుంచి శాసన మండలి ఛైర్మన్ గా పని చేశారు.ఇక ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత కెసిఆర్ పట్టించుకోకపోవడంతో ఆయన చాలాకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు .ఇప్పుడు ఆయనను బీజేపీ కీలక నేతలు కలిసి బిజెపి లో చేరవలసిందిగా ఆహ్వానించినట్లు ,ఆయన ఒప్పుకున్నట్లు సమాచారం.

అలాగే కాంగ్రెస్ లో గతంలో కీలకంగా వ్యవహరించిన తర్వాత సస్పెన్షన్ వేటుకు గురైన సర్వే సత్యనారాయణ సైతం బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తోంది .స్వయంగా బిజెపి రాష్ట్ర నాయకులు ఆయన ఇంటికి వెళ్లి మరి ఆహ్వానించడంతో ఆయనకు ఎక్కడలేని ఆనందం కలుగుతుందట.ఇక కాంగ్రెస్, బిజెపి , టిఆర్ఎస్ ఎలా అన్ని పార్టీల్లోనూ ఉన్న నాయకులు కొంతమంది సరైన రాజకీయ ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు .ఇప్పుడు అటువంటి నాయకులకు బాగా ప్రాధాన్యం పెరిగింది.వారు ఎక్కడ పార్టీ మారిపోతారనే భయంతో సొంత పార్టీ నేతలు వారికి అనేక ప్రయోజనాలు కల్పించేందుకు , హామీలు ప్రత్యర్ధి పార్టీలు సైతం వారిని ఏదో రకంగా తమ పార్టీలో చేర్చుకునే విషయంపై దృష్టి పెట్టి వారితో మంతనాలు చేస్తూ వస్తుండడంతో, చిన్నా చితకా నాయకులకు సైతం గ్రేటర్ పరిధిలో బాగా ప్రాధాన్యం పెరిగింది.