టెలికాం రంగంలో రిలయెన్స్ జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.మార్కెట్‌లోకి రాకముందే కొన్ని నెలల పాటు ఫ్రీగా 4జీ డేటాను కస్టమర్లకు ఇచ్చేసింది.
అధికారికంగా తన సేవలు ప్రారంభించిన తర్వాత కూడా మిగతా కంపెనీలతో పోలిస్తే అతి తక్కువ ధరకే మొబైల్ సేవలను అందించింది.
జియో దెబ్బకు వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లాంటి టాప్ టెలికాం సంస్థలు కూడా తమ కస్టమర్లకు తక్కువ ధరకే 4జీ సేవలు అందించాల్సి వచ్చింది.
దీంతో ఒక్క జియో తప్ప మిగతా సంస్థలన్నీ తీవ్ర నష్టాలను చవిచూశాయి.జియో విషయంలో ముందు నుంచీ ప్రత్యర్థులు గుర్రుగా ఉన్నారు.ఇలా అయితే కష్టమని ట్రాయ్ దగ్గర మొరపెట్టుకున్నారు.
ఏదైనా వస్తువు లేదా సేవలను అమ్మేందుకు కావాల్సిన కనీస ధర అయిన ఫ్లోర్ ప్రైస్‌ను నిర్ణయించాల్సిందిగా ట్రాయ్‌పై ఒత్తిడి తెచ్చాయి.
అయితే ఈ ఫ్లోర్ ప్రైస్‌పై ఎటూ తేల్చని ట్రాయ్.ధరలు పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చింది.దీంతో డిసెంబర్ 1 నుంచి అన్ని టెలికాం సంస్థలు తమ ధరలను పెంచేస్తున్నాయి.

మొదట్లో జియో దీనికి అంగీకరించకపోయినా.తర్వాత మిగతా టెలికాం సంస్థలు, ట్రాయ్ ఒత్తిడితో తాను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది.అంటే ఇన్నాళ్లూ మిగతా నెట్‌వర్క్‌లను వదిలి జియోతో బాగా ఎంజాయ్ చేసిన వాళ్లపై కూడా ఈ ధరల పెంపు భారం పడనుంది.
ఇప్పటికే ఆఫ్ నెట్ కాల్స్‌కు కూడా జియో చార్జ్ చేస్తోంది.ఇదే కనీసం 14 నుంచి 15 శాతం పెంపు అనుకుంటే.డిసెంబర్ 1 నుంచి మరింత భారం మోపడానికి జియో సిద్ధమవుతోంది.

ఈ టారిఫ్స్ పెంపు ద్వారా వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లు అదనంగా ఆర్జించడానికి టెలికాం సంస్థలు రెడీగా ఉన్నాయి.దీనికితోడు అప్పుల ఊబిలో నుంచి బయటపడటానికి 42 వేల కోట్ల స్పెక్ట్రమ్ చెల్లింపులకు రెండేళ్ల మారటోరియం విధించాలని, లైసెన్స్ ఫీజులను తగ్గించాలని, స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలను తగ్గించాలని కూడా టెలికాం సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.