ఎవరిని నమ్మాలి ఎవరిని అనుమానించాలి ఎవరు మనవాళ్ళు ? ఎవరు కోవర్టులు ఇవే ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల లో అన్ని రాజకీయ పార్టీలను వేధిస్తున్న ప్రధాన సమస్య.తమ రాజకీయ ప్రత్యర్ధులకు అవకాశం ఇవ్వకుండా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ జనాల్లో పలుకుబడి సంపాదించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఉండగా, కొన్ని కొన్ని కీలక విషయాలు ప్రత్యర్థి పార్టీలకు చేరిపోయి, వారు తమ కంటే ముందుగానే ఆ వ్యూహాలను అమలు చేస్తుండడంతో, సొంత పార్టీలో ఉన్న కోవర్టులను గుర్తించే పనిలోనే ఆయా పార్టీలు అభ్యర్థులు నిమగ్నమయ్యారట.
సొంత పార్టీలోనే ఈ కోవర్ట్ లు ఎక్కువగా ఉండడంతో అందరినీ అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడిందట.బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ లో ఈ సమస్య ఎక్కువగా ఉండడంతో, ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.
ఇటీవల ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు ఎక్కువయ్యాయి.ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈ వలసలు పెరగడం తో వచ్చిన వారు నిజంగానే పార్టీపై అభిమానం తో వచ్చారా ? లేక కోవర్టుగా పార్టీలో చేరారా అనేది అనుమానంగానే మారింది.హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించడంతోనే, ఈ కోవర్టుల భయంతో అన్ని పార్టీలు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.కీలకమైన విషయాలు లీక్ అయి పోతూ ఉండటం తో, చాలా జాగ్రత్తగా తమ వ్యూహాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది .ఇప్పుడు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.ఓటర్లను కలుస్తూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇక పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చిందంటే ఓటర్లను మభ్యపెట్టే కార్యక్రమం మొదలవుతుంది.ఈ సమయంలోనే పార్టీల్లో ఉన్న కోవర్టులు తమ విశ్వరూపం చూపించే అవకాశం ఉండడంతో అన్ని పార్టీలు టెన్షన్ పడుతున్నాయి. ఈనెల 30వ తేదీన జరగబోయే పోలింగ్ ను దృష్టిలో పెట్టుకుని బీజేపీ, టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.ముఖ్యంగా బిజెపి ,టిఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది.
టిఆర్ఎస్ తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయగా , బిజెపి సైతం కేంద్ర మంత్రులను రంగంలోకి దించి ఈ నియోజకవర్గంలో విజయాన్ని దక్కించుకోవాలని చూస్తోంది.ఈ విషయంలో కాంగ్రెస్ కాస్త వెనుకబడినట్టుగానే కనిపిస్తోంది.