ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలను( Ys Sharmila ) కాంగ్రెస్ అధిష్టానం నియమించబోతుంది అనే ప్రచారం గత కొద్దిరోజులుగా విస్తృతంగా జరుగుతోంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోటీకి దూరంగా ఉంది.
తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిల ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు.అయితే తెలంగాణ కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం కావడంతో, కాంగ్రెస్ అధిష్టానం వెనక్కి తగ్గింది.
దీంతో షర్మిల ఒంటరిగానే మిగిలిపోయారు.అయితే షర్మిల సేవలను ఏపీలో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది.
ఈ మేరకు కొత్త ఏడాదిలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండడంతో షర్మిల కు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను అప్పగించాలనే ఆలోచనతో ఉన్నారు.

ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేసే విషయంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi )దృష్టి సారించారు.అయితే షర్మిల నియామకం ద్వారా ఏపీలో కాంగ్రెస్ కు ఏ మేరకు లాభం చేకూరుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.షర్మిల సోదరుడు వైఎస్ జగన్ ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు.వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు జగన్ తీవ్రంగానే కసరత్తు చేస్తున్నారు.ఈ సమయంలో వైఎస్ షర్మిల వైసిపి పై విమర్శలకు దిగితే ఆ ప్రభావం ఎంత మేరకు ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.2019 ఎన్నికల సమయంలో వైసీపీ విజయం కోసం షర్మిల భారీగానే ప్రచారం నిర్వహించారు.బై బై బాబు అంటూ షర్మిల చేసిన ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇప్పుడు నేరుగా జగన్( CM jagan ) పైన , పార్టీ పైన షర్మిల విమర్శలకు దిగితే జనాల నుంచి ఏ స్థాయిలో స్పందన వస్తుందనేది తేలాల్సి ఉంది.మొన్నటి వరకు తెలంగాణ బిడ్డగా షర్మిల చెప్పుకున్నారు.ఇప్పుడు అక్కడ రాజకీయాలతో సంబంధం లేదని , ఏపీ రాజకీయాల్లో అడుగుపెడితే జనానుంచి ఆమెకు ఎంతవరకు మద్దతు లభిస్తుందనేది తేలాల్సి ఉంది.