నిత్యం ఏదో ఒక అంశంతో టిఆర్ఎస్ పై విరుచుకు పడుతూనే వస్తున్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్.తనను అవమానకరంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో వెంటనే టిఆర్ఎస్ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయిన రాజేందర్ ఇప్పుడు ఉప ఎన్నికలలో గెలిచేందుకు తగిన వ్యూహాలను అమలు చేస్తున్నారు.
తాను చేరిన బిజెపి బలంతో పాటు, తన సొంత సామాజికవర్గం అండదండలు, రెడ్డి సామాజిక వర్గం నుంచి తనకు మద్దతు పూర్తిగా ఉంటుందని భావిస్తున్న రాజేందర్ గెలుపుపై ధీమా గానే ఉన్నారు.ఈ పరిస్థితిని మార్చేందుకు, రాజేందర్ ప్రభావం పూర్తిగా తొలగించేందుకు ఆయనకు సన్నిహితుడిగా పేరొందిన టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు కు కేసీఆర్ పూర్తి బాధ్యతలు అప్పగించారు.
పార్టీ అభ్యర్థికి విజయం దక్కేలా చేయాల్సిన బరువు బాధ్యతలు మొత్తం హరీష్ పైనే వేశారు.దీంతో హరీష్ రావు మొత్తం హుజూరాబాద్ నియోజకవర్గంను జల్లెడ పడుతున్నారు.అక్కడకు పెద్దగా వెళ్లకపోయినా, హైదరాబాద్ కేంద్రంగానే హుజురాబాద్ రాజకీయాలను శాసిస్తున్నారు.రాజేందర్ వైపు వెళ్తారనుకున్న నాయకులను పిలిపించుకుని టిఆర్ఎస్ లో ఉండే విధంగా వారిని ఒప్పిస్తున్నారు.
హరీష్ రావుతో ఇబ్బందిపడుతున్న రాజేందర్ ఇప్పుడు ఆయనను టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.తన నియోజక వర్గం వారికి హరీష్ రావు దావత్ డబ్బు ఇస్తున్నారని రాజేందర్ విమర్శలు చేస్తున్నారు.

కెసిఆర్ మెప్పు పొందాలని హరీష్ రావు చూస్తున్నాడని , తనకు ఏ గతి అయితే పట్టిందో అదే గతి హరీష్ రావు కు పడుతుంది అంటూ రాజేందర్ కామెంట్స్ చేస్తున్నారు.గతంలో హరీష్ రావు ను కేసీఆర్ పక్కన పెట్టినట్లు గా వ్యవహరించడం, ఆయనకు మంత్రి పదవి చాలాకాలం పాటు ఇవ్వకపోవడం తో కేటీఆర్ ప్రాధాన్యం పెంచడం వంటి కారణాలతో హరీష్ రావు టిఆర్ఎస్ లోకి వెళ్ళబోతున్నారనే ప్రచారం జరిగింది.అవన్నీ అసత్యాలే అంటూ హరీష్ రావు అప్పట్లో ఖండించినా, హరీష్ అనుచరులు మాత్రం కేసీఆర్ తీరుతో అసహనంతో రగిలిపోయారు.ఇక టీఆర్ఎస్ కు రాజేందర్ రాజీనామా చేయడంతో హరీష్ ప్రాధాన్యం మళ్ళీ కేసీఆర్ పెంచారు.
ఈ అంశాలను రాజేందర్ ప్రస్తావిస్తూ, హరీష్ దూకుడు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు.