కాస్టింగ్‌ కౌచ్‌.. మంత్రిగారు ఇవేం మాటలండి       2018-07-08   23:32:35  IST  Raghu V

టాలీవుడ్‌తో పాటు అన్ని సినిమా పరిశ్రమల్లో కూడా కాస్టింగ్‌ రక్షసి ఉందని, కొత్త వారికి అవకాశాలు రావాలి అంటే వారు శారీరకంగా మరియు మానసికంగా మరియు ఆర్థికంగా కూడా సమర్పించుకోవాల్సి వస్తుందంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా ఆడవారు కాస్టింగ్‌ కౌచ్‌కు ఎక్కువగా బలవుతున్నారనే విషయం అందరికి తెల్సిందే. కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అన్ని సినిమా పరిశ్రమల వారు కూడా ఆందోళనలు నిర్వహిస్తూ, సభలు సమావేశాలు జరుపుతూ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇది చాలా పెద్ద, కీలకమైన సమస్య అంటూ అంతా గుర్తించారు.

ఈ సమస్య సీరియస్‌ నెస్‌ను అంతా పట్టించుకుంటున్నారు కాని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా కాస్టింగ్‌ కౌచ్‌ విషయమై మంత్రి మాట్లాడుతూ.. తాను ఈ విషయాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోవాలని భావించడం లేదు. ఎందుకంటే ఇది అసలు మేజర్‌ ఇష్యూ కానే కాదు. ఒకవేళ ఇదే పెద్ద సమస్య అని తాను భావిస్తే తప్పకుండా హండ్రెస్‌ పర్సెంట్‌ స్పందిస్తా. పనికి మాలిన విషయాలను పెద్దగా చూపించి, ఇదే ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్నారు అంటూ చెబితే నేను స్పందించను అంటూ ఈ సందర్బంగా మంత్రి చెప్పుకొచ్చారు.

దేశంలో చాలా సమస్యలు ఉంటే ఈ సమస్యను ఎందుకు ఇంత పెద్దగా చేసి చూస్తున్నారు, మీడియాలో కూడా ఎందుకు ఈ విషయమై ఇంతగా ప్రచారం జరుగుతుందో అర్థం కావడం లేదు అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అనే విషయం అందరికి తెల్సిందే. అయితే సమస్య పెద్దదైనా, చిన్నదైనా ఒక బాధ్యతగల పాత్రను పోషిస్తున్న సమయంలో తప్పకుండా ఆ విషయమై స్పందించాల్సిన అవసరం ఉంది.

పనికిమాలిన వ్యవహారం అంటూ తీసి పడేయడం ఆయన గౌరవాన్ని తగ్గిస్తుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బాగుండేది అంటూ సినీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం తెలుగు సినిమా పరిశ్రమలోనే వందల సంఖ్యలో కాస్టింగ్‌ కౌచ్‌కు బలై ఉంటారు అంటూ ఒక సర్వేలో వెళ్లడైంది. ఇలాంటి సమయంలో మంత్రి దీనిని పనికిమాలిన విషయం అంటూ వ్యాఖ్యానించడం బాగాలేదని మహిళ సంఘాల వారు అంటున్నారు.