గతంలో ఎన్నడూ లేని విధంగా మొన్న సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు.ఏకంగా వారం రోజులకు పైగా అక్కడే మకాం వేశారు.
ఏదో పార్టీ ఆఫీస్కు శంకుస్థాపన కోసం అని వెల్లిన కేసీఆర్ తన ప్లాన్ ఛేంజ్ చేసి బీజేపీ కేంద్ర పెద్దలను వరుసబెట్టి కలుసుకున్నారు.దీంతో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు వచ్చాయి.
బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య అంతర్గత పొత్తు జరిగిందని, వారి మధ్య ఏదో ఒప్పందం కుదిరినట్టు చాలా రకాల వార్తలు రావడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.దీంతో ఈ విషయంపై కాంగ్రేస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టిందని చెప్పాలి.
టీఆర్ ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒకటేనని, అవి ఇక్కడ గల్లీలో కుస్తి పట్టి చివరకు ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయంటూ విమర్శలు చేస్తోంది.అయితే ఈ భేటీపై మాత్రం అటు టీఆర్ ఎస్, ఇటు బీజేపీ మాత్రం పెద్దగా స్పందించలేదు.
మరీ ముఖ్యంగా బీజేపీ పార్టీకి ఇక్కడ పెద్ద షాక్ తగిలినట్టయింది.ఇప్పటికే బండి సంజయ్ నేతృత్వంలో రాబోయే సాధారణ ఎన్నికల్లో గెలిచే విధంగా బీజేపీ పావులు కదుపుతోంది.
ఇప్పటికే పాదయాత్రలు, విమోచన దిన సభ లాంటివి కూడా ప్లాన్ చేస్తోంది.ఇలాంటి తరుణంలో కేంద్ర నాయకత్వాన్ని కూడా తెలంగాణకు రప్పించి పార్టీని మరింత బలోపేతం చేయాలని చూస్తోంది.

కానీ అనూహ్యంగా కేసీఆర్ ఢిల్లీ టూర్ చేయడంతో అంతా రివర్స్ అయిపోయింది.రాష్ట్రంలో బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న సమయంలోనే కేసిఆర్ మాస్టర్ ప్లాన్ వేసి ఢిల్లీ పెద్దలను కలవడంతో బీజేపీ, టీఆర్ ఎస్ కలిసిపోతున్నాయంటూ విమర్శలు రావడం బీజేపీకి పెద్ద సమస్యే అని చెప్పాలి ఇకపోతే దీన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ బాగానే వినియోగించుకుంటోంది.కానీ అధికార టీఆర్ ఎస్ మాత్రం దీనిపై పెద్దగా స్పందించట్లేదు.కనీసం కేసీఆర్ ఎందుకు కలిశారో కూడా వివరించే ప్రయత్నం చేయట్లేదు.దీంతో ఏదో జరుగుతోందని చర్చలు సాగుతున్నాయి.