పోలీస్ బెటాలియన్ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత...!

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రంలోని 255 సర్వే నెంబర్ భూముల్లో పోలీస్ బెటాలియన్ అమలు జరుగుతుందనే ప్రస్తావన రాగానే 70 ఏళ్లుగా ఆ భూములను నమ్ముకున్న రైతుల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

భూములు కాపాడుకునేందుకు అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన బాటపట్టి,ప్రభుత్వం భూమిని నమ్ముకున్న రైతుల పొట్ట కొట్టడం ఏంటని ప్రశ్నిస్తుండగా,మరికొందరు అసలు బెటాలియన్ వలన లాభమా నష్టమా అనే సందిగ్ధంలో పడ్డారు.

ఒకవేళ పోలీస్ బెటాలియన్ కోసం భూములు కేటాయిస్తే రైతులకు న్యాయం జరుగుతుందా? వేరే దగ్గర భూములు ఇస్తారా? లేక నష్టపరిహారం చెల్లిస్తారా?అనే ఆలోచనల్లో ఇంకొందరు పడిపోయారు.న్యాయం కోసం అఖిలపక్ష నాయకులతో కలిసి వినతిపత్రాలు ఇస్తూ, నాయకుల,అధికారుల చుట్టూ తిరుగుతూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు.

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చ తీసుకురావాలని ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందిస్తున్నారు.బెటాలియన్ కావాలని,వద్దని రెండు వర్గాలుగా వాగ్వాదం జరుగుతున్న నేపథ్యంలో ఆఖరికి రైతులకు న్యాయం చేసి బెటాలియన్ వేయాలని, లేకుంటే ప్రభుత్వ భూమి ఉన్నచోట అమలు చేయాలనే ఆలోచనకు ఒక వర్గం వచ్చినట్లు తెలుస్తోంది.

నమ్ముకున్న రైతులకు న్యాయం చేయాలని, బెటాలియన్ రద్దు చేయాలని, అదే భూముల్లో కొనసాగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని మరో వర్గం, అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు.ఒకవేళ పడితే రైతులకు ఇబ్బంది అవుతుంది.

Advertisement

పడకుంటే అభివృద్ధికి దూరమేనని మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.గతంలో నారాయణపురానికి బిడియల్, గురుకుల పాఠశాల దూరం చేసుకున్నామని,ఇప్పుడు అభివృద్ధిలో ముందుకు నడవాలంటే ఇలాంటి వాటిని బహిష్కరిద్దామా? లేక ప్రభుత్వ భూములలో ఏర్పాటు చేసుకుని నిలబెడుదామా?అని కొందరు అంటున్నారు.బెటాలియన్ ఏర్పాటు అవుతుందా లేదా అనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

ఏది ఏమైనా సాగును నమ్ముకున్న రైతులకు న్యాయం చేసి,పోలీస్ బెటాలియన్ నారాయణపురంలో ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తున్నట్లు సమాచారం.

Advertisement

Latest Yadadri Bhuvanagiri News