నాయకుడు అంటేనే పార్టీలోని కార్యకర్తలకు ఎంత దగ్గరగా ఉంటే వారు ఆయన్ను నమ్ముకుని అంతలా పనిచేస్తారు.అంతేగానీ వారిని పట్టించుకోకుండా దూరం పెడితే వారు కూడా దూరం అయిపోయి ఇతర పార్టీలవైపు చూస్తారు.ఈ సూత్రం చంద్రబాబు నాయుడు ఇప్పడు స్పష్టంగా తెలుసుకున్నట్టు అర్థం అవుతోంది.2019ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి టీడీపీలో విపరీతంగా గ్రౌండ్ లెవల్ కార్యకర్తలు వలసల బాట పడుతున్నారు.దీంతో చంద్రబాబు అలర్ట్ అయిపోయారు.ఇంకా చెప్పాలంటే ఓటమి ఆయనలో స్పష్టమైన మార్పు తెచ్చింది.
అందుకే ఇటీవల కాలంలో చంద్రబాబు పూర్తిగా తన సహజత్వానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు.తమ పార్టీలోని గ్రౌండ్ లెవల్ కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వెంటనే స్పందిస్తున్నారు.
టీడీపీ కార్యకర్తలు ఎవరైనా ప్రమాదాలకు గురైనా లేదంటే ఇతర సమస్యలతో బాధపడుతున్నా, లేదంటేరాజకీయ ప్రత్యర్థుల నుంచి వేధింపులు వస్తున్నా వెంటనే చంద్రబాబు నేనున్నానంటూ అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు.ఆయనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటమో వీలైతే కలిసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ మార్పు వారిలో స్థైర్యాన్ని పెంచుతోందనే చెప్పాలి.నేనున్నాననే ధైర్యం, భరోసా ఇస్తే కార్యకర్తలు ఎంతలా కష్టపడుతారో చంద్రబాబుకు తెలియనిది కాదు.ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు గతంలో అన్నీ తనకే తెలుసన్న మాదిరిగా ఎవరి మాట వినకుండా ఏక పక్ష నిర్ణయాలు తీసుకునేవారు.కానీ ఇప్పుడు అలా కాకుండా పార్టీలో అందరి నిర్ణయాలకు గౌరవమిస్తున్నారు.
తన పార్టీలోని కార్యకర్తలు చెప్పే వాటిని ఓపిగ్గా వింటున్నారు.వారికి తనవంతుగా చేతనైనంతగా సాయం చేస్తున్నారు.
ఇదే ఇతర కార్యకర్తలను పార్టీ వీడి వెళ్లకుండా కాపాడుతోందని తెలుస్తోంది.ఏదేమైనా చంద్రబాబులో ఇలాంటి మార్పునే కార్యకర్తలు కూడా కోరుకున్నారు.
ఈ మార్పు అటు పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు బాగానే ఉపయోగపడుతుందని అంతా భావిస్తున్నారు.