ఇప్పటి వరకు ఎప్పుడు చూడని పెను సంక్షోభాన్ని తెలుగుదేశం పార్టీ చూస్తోంది.పార్టీ నేతలు ఎవరిలోనూ ఉత్సాహం అనేది కనిపించడంలేదు.
భవిష్యత్తుపై బెంగ, నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి.పార్టీ పుంజుకునే అవకాశం లేదనే అభిప్రాయం వీరిలో గూడు కట్టుకున్నాయి.
దీంతో ఒక్కో ఎమ్మెల్యే, ఒక్కో కీలక నాయకుడు వైసిపి బాట పడుతున్నారు.పార్టీలో వలసలు నిరోధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, ఎవరు ఆగేలా కనిపించడం లేదు.
ప్రస్తుతం టిడిపి అధినేత చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటం, చంద్రబాబు జనాల్లో తిరగడం అంత మంచిది కాదనే సూచనలతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు.
ఏపీకి వచ్చేందుకు ఇప్పట్లో అవకాశమే కనిపించడం లేదు.దీంతో వైసీపీలో చేరికలు మరింత ముమ్మరం అయ్యాయి.తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా పోగొట్టడమే ప్రధాన ఉద్దేశంగా ఇప్పుడు వైసీపీ పావులు కదుపుతూ, ఒక్కో ఎమ్మెల్యేని పార్టీ నుంచి దూరం చేసే కార్యక్రమానికి వైసిపి శ్రీకారం చుట్టింది.క్రమక్రమంగా టిడిపి ఎమ్మెల్యేలు అందరితో పాటు, నియోజకవర్గ స్థాయి కీలక నాయకులు పార్టీలో యాక్టివ్ గా ఉండే వారు అందరిని తమ పార్టీలో చేర్చుకోవాలనే అభిప్రాయంతో ముందుకు వెళుతోంది.
వైసిపి దూకుడు చూస్తుంటే, తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేసేలా కనిపిస్తున్నారు.

ఈ దశలో పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు వెంటనే హైదరాబాద్ నుంచి ఏపీకి రావాలంటూ పెద్ద ఎత్తున సీనియర్ నాయకులు కోరుతున్నారు.అయినా బాబు మాత్రం ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు.పోనీ ఆయన కుమారుడు లోకేష్ ఏపీలో అడుగు పెడతాడా అంటే, ఆయన బాబు కంటే మరింత జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటికే పరిమితం అయిపోయారు.
ప్రస్తుతం టిడిపి క్యాడర్ నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి.పార్టీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉండాలి అంటూ, పదే పదే పిలుపు ఇస్తున్నా, పట్టించుకునే వారే కరువయ్యారు.
దీంతో పార్టీకి వీలైనంత దూరంగా వారు ఉంటూ వస్తున్నారు.ఈ దశలో చంద్రబాబు ఏపీకి రావాలని, పార్టీ కేడర్ లో ఉత్సాహం తీసుకురావాలని జిల్లాల వారీగా పర్యటనలు చేపట్టి కార్యకర్తలకు, నాయకులకు భరోసా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని, లేకపోతే పార్టీలో నాయకులు ఎవరూ మిగిలే పరిస్థితి లేదనే ఆందోళనలో టిడిపి అభిమానులు ఉన్నారు.
ఎవరు ఎన్ని రకాలుగా చంద్రబాబుపై ఒత్తిడి చేసినా, ఆయన మాత్రం ఇప్పట్లో ఏపీకి వచ్చేలా కనిపించడం లేదు.