ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఏది చేసినా దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక ప్రయోజనం ఉంటుందనేది తెలుగు తమ్ముళ్ల నమ్మకం.అందుకు తగ్గట్టుగానే బాబు వ్యూహాలు, కార్యక్రమాలు ఉంటాయి.
ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పరిస్థితి ఏంటో తెలియని అయోమయ పరిస్థితి, గందరగోళం నెలకొనడంతో పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం రేకెత్తించేందుకు బాబు రాకరరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు.దానిలో భాగంగానే నిన్న నిర్వహించిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమం టీడీపీలో జోష్ నింపిందనే చెప్పాలి.
టీడీపీలో నాయకులు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నప్పటికీ బాబు మాత్రం క్యాడర్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు.బలమైన ఓటు బ్యాంకు ఉన్న టీడీపీకి నాయకులు ముఖ్యం కాదు అనే ఆలోచనలో బాబు ఉన్నట్టు అర్ధం అవుతోంది.
అందుకే ముందుగా వారిలో జోష్ నింపే కార్యక్రమాలకు బాబు పెద్ద పీట వేస్తున్నాడు.

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఛలో ఆత్మకూరు కార్యక్రమం కేవలం పల్నాడు ప్రాంతానికే పరిమితం అయినా రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించింది.అంతే కాదు ఛలో పల్నాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్టంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ క్యాడర్ ముందుకు కదిలింది.ముందురోజే మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డి, అఖిలప్రియ లాంటి నేతలు గుంటూరుకు చేరుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నించారు.
అసలు చంద్రబాబు ఈ స్థాయిలో దూకుడు ప్రదర్శించడానికి గల కారణాలు విశ్లేషిస్తే అసలు విషయం బయటపడుతోంది.మూడేళ్లలో తప్పనిసరిగా జమిలి ఎన్నికలు వస్తాయని బాబు బలంగా నమ్ముతున్నాడట.

దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం ఉత్సాహం చూపిస్తుండడంతో చంద్రబాబు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నాడట.మూడేళ్లు అంటే ఎక్కువ సమయమే ఉన్నా కోలుకోలేని రీతిలో గత ఎన్నికల్లో ఫలితాలు రావడంతో నాయకులు, క్యాడర్ నైరాశ్యంలో మునిగిపోయారు.అందుకే ఛలో ఆత్మకూరు తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇటువంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు చంద్ర బాబు కసరత్తు చేస్తున్నాడట.ఇక నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ, ప్రజా సమస్యల విషయంలో పోరాటాలు చేస్తూ అధికార పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి పార్టీలో కొత్త ఉత్సాహం రేకెత్తించేందుకు బాబు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది.