టీడీపీ యువ నాయకుడు, చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేష్ రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సొంత పార్టీ నాయకులకే ఆయనపై నమ్మకం లేకపోవడం, ఆయన నాయకత్వాన్ని ఒప్పుకోనట్టుగా వ్యవహరిస్తుండడం వంటివి లోకేష్ కు ఇబ్బందికరంగా మారాయి.
ఇప్పుడు కాకపోతే మరి కొంతకాలానికి అయినా, పూర్తిగా తెలుగుదేశం పార్టీ బరువు బాధ్యతలను మోసేది లోకేష్ మాత్రమే.ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం దూకుడుగా ఉన్న వైసీపీ ప్రభుత్వం స్పీడ్ తట్టుకోవడం లోకేష్ వల్ల కాదనేది చంద్రబాబు అభిప్రాయం.
అందుకే లోకేష్ ను పక్కన పెట్టి పార్టీలో ఎన్నో కీలకమైన మార్పు చేర్పులు చేస్తున్నారు.పూర్తిగా పార్టీని ప్రక్షాళన చేసి యువ నాయకత్వాన్ని ఎక్కువగా యాక్టివ్ చేస్తూ, వారికి కమిటీల్లో కీలకమైన పదవులు అప్పగిస్తూ, హడావుడి చేస్తున్నారు.
అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇంచార్జీలను ఇప్పటికే నియమించారు.కానీ ఏపీ టిడిపి అధ్యక్షుడు విషయంలో మాత్రం బాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.దీనికి కారణం అచ్చెన్నాయుడు పేరును లోకేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోక పోవడమేనట.వాస్తవంగానే అచ్చెన్నాయుడు దూకుడుగా ఉంటారు.
రాజకీయ ఎత్తులు, పైఎత్తులు వేయడం చంద్రబాబు స్థాయిలో ఆయన వ్యవహరిస్తారు.చంద్రబాబు ఆలోచన ప్రకారం చూస్తే, ఇప్పుడు అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి సరైన వ్యక్తి.
ఆయన కాకుండా అంతటి స్థాయి ఉన్న మరో నేత ప్రస్తుతానికి కనిపించడం లేదు.దీంతో చంద్రబాబు ఆయన పేరునే దాదాపు ఫైనల్ చేసేసారు.
లోకేష్ మాత్రం తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందు ముందు జరగబోయే పరిణామాలను అంచనా వేసుకుని ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తున్నారు.తాను తిరుగులేని నాయకుడిగా ఎదగాలి అంటే అచ్చెన్న వంటి నాయకుడి చరిష్మా ముందు తాను తేలిపోతానని, ప్రత్యర్థులను విమర్శించడంలో గాని, రాజకీయ ఎత్తులు వేయడంలో గాని, అచ్చెన్న కంటే వెనుకబడి పోతానని, దీంతో పార్టీలో తన పట్టు చేజారిపోతుందని, రాబోయే రోజుల్లో తన మాట ఎవరూ లెక్క చేసే పరిస్థితి ఉండదని, ఇలా ఎన్నో రకాలైన విశ్లేషణలు లోకేష్ వేసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు.
అందుకే ఎట్టి పరిస్థితుల్లో టిడిపి బాధ్యతలు అచ్చెన్నకు అప్పగించేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది.

రానున్న రోజుల్లో లోకేష్ రాజకీయ భవిష్యత్తు కంటే, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ బతికి బట్ట కట్టడం ముఖ్యమనేది చంద్రబాబు అభిప్రాయంగా కనిపిస్తోంది.అందుకే లోకేష్ ను అచ్చెన్న డామినేట్ చేస్తాడు అని తెలిసినా, తప్పని సరి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు ఆయనవైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. లోకేష్ చంద్రబాబు మధ్య ఈ విషయమై ఎటువంటి స్పష్టత రాకపోవడంతోనే ఏపీ టీడీపీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడుతున్నట్లుగా ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతానికి ఈ వ్యవహారంపైనే చంద్రబాబు లోకేష్ మధ్య అంతర్యుద్ధం కూడా జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.
ఈ పరిణామాలు పార్టీ భవిష్యత్తుకి ఎక్కడ స్పీడ్ బ్రేకర్లుగా మారుతాయో అనే ఆందోళన సైతం ఆ పార్టీ నాయకుల్లో ఉంది.
రాజకీయ వారసత్వం గురించి ఆలోచించేకంటే చంద్రబాబు ఆలోచన ప్రకారం పార్టీ భవిష్యత్తుపైనే ఎక్కువ దృష్టిపెడితే మంచిది అనే అభిప్రాయాలూ ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతున్నాయి.కాకపోతే ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి.