చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఏంటో టిడిపి అధినేత చంద్రబాబు కు బాగా తెలిసినట్లు కనిపిస్తోంది.ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో వరుసగా ఎదురైన ఓటమితో బాబు తీవ్ర నిరాశతో ఉన్నారు.
అంతే కాదు టిడిపి కి రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుగాలి వీస్తుందని, పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం లోనే టిడిపి పరిస్థితి ఈ విధంగా ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎంత దారుణంగా ఉందో అనే చర్చ పార్టీ కేడర్ లో జరుగుతుండడం, వైసీపీ కూడా కుప్పం లో పూర్తిగా పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నించాలని చూస్తుండడం వంటి వ్యవహారాలతో బాబు అలర్ట్ అయ్యారు.వాస్తవ పరిస్థితులు ఏమిటనేది గ్రహించారు.
అందుకే వరుసగా మూడు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు.ఈ సందర్భంగా అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకులు చాలామంది ఈ నియోజకవర్గంలో ఉన్నా, వారు సరిగా పనిచేయలేదని, పార్టీ నాయకులపై ఘాటుగా విమర్శలు చేశారు.అంతే కాదు పార్టీ క్యాడర్ చెప్పినట్టే ఇక చేస్తానని, పనిచేయని నాయకులు అందర్నీ పక్కన పెడతానంటూ చెప్పడంతో పార్టీ కేడర్ లో ఉత్సాహం కనిపించింది.
ముఖ్యంగా చంద్రబాబు తరపున ఆయన పిఎ మనోహర్, గౌరవాణి శ్రీనివాసులు, ముని రత్నం వంటి వారిపై పార్టీ క్యాడర్ ఎప్పటి నుంచో తీవ్ర అసంతృప్తితో ఉంది.వారిని మార్చాలని డిమాండ్ ను ఎప్పటి నుంచో చేస్తున్నా బాబు ఎప్పటికప్పుడు ఈ విషయంలో దాటవేసే ధోరణితో ఉంటూ వచ్చారు.
అయితే ఇప్పుడు వారిని పూర్తిగా పక్కన పెట్టినట్లు సమాచారం.కుప్పం పర్యటనలో వారు ఎక్కడా బాబు వెంట కనిపించకపోవడం , వారిని దూరంగా ఉండాల్సిందిగా సూచించినట్లుగా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.

అంతేకాదు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు ఇల్లు లేదు అంటూ వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉండడం పైన బాబు సీరియస్ గా స్పందించారట.రాబోయే దీపావళి నాటికి కుప్పంలో తన ఇంటి నిర్మాణం పూర్తి అవ్వాలని కొంతమంది కీలక నాయకులను ఆదేశించారట.ప్రస్తుతం టిడిపి కార్యాలయం ఎదుట ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా వెతుకులాట మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం కుప్పం నియోజకవర్గ బాధ్యతలను మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డికి అప్పగించబోతున్నారట.
మొత్తంగా ఈ నియోజకవర్గంలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి , రాబోయే రోజుల్లో తనకు పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలనే విషయంపై బాబు దృష్టి పెట్టారట.